తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో కళ్యాణమస్తు ఒకటి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ పథకం అమలును తాత్కాలికంగా నిలిపివేశారు. ఇపుడు రాష్ట్రంలో కరోనా శాంతించింది. దీంతో 'కల్యాణమస్తు' కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సన్నద్ధమైంది. ఈ సామూహిక వివాహాల కోసం మొత్తం మూడు ముహూర్తాలను ఖరారు చేసిందని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు.
ఈ మూడు ముహుర్తాల్లో భాగంగా, తొలి ముహూర్తం మే 28న మధ్యాహ్నం 12.34 నుంచి 12.40 మధ్య, అక్టోబరు 30న ఉదయం 11.04 నుంచి 11.08 మధ్య రెండోది, నవంబరు 17న ఉదయం 9.56 నుంచి 10.02 మధ్య మూడో ముహూర్తాన్ని ఖరారు చేసినట్టు ఈవో తెలిపారు.
జి.బాలసుబ్రహ్మణ్యం, కుప్పా శివసుబ్రహ్మణ్యం అవధాని, అర్చకం వేణుగోపాల దీక్షితులు, వేదాంతం శ్రీవిష్ణు భట్టాచార్యులతో కూడిన పండిత మండలి సమావేశమై ఈ ముహూర్తాలను నిర్ణయించింది. అనంతరం కల్యాణమస్తు లగ్నపత్రికను జవహర్‌రెడ్డి, ధర్మారెడ్డిలకు అందించారు.