తిరుపతి పట్టణంలోని అలిపిరి పాదాల మండపం వద్ద 15 కోట్ల రూపాయలతో గోమందిరాన్ని తితిదే నిర్మిస్తుంది. ఈ మందిరాన్ని శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని తితిదే ఈవో జవహర్ రెడ్డి వెల్లడించారు.
అలిపిరిలో నిర్మిస్తున్న గోమందిరాన్ని, చిన్నపిల్లల ఆసుపత్రి, డిపిడబ్ల్యు స్టోర్స్‌లో పంచగవ్య ఉత్పత్తుల తయారీ కేంద్రం ఏర్పాటును.. అదనపు ఈవో ధర్మారెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ మందిరాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు.
పంచగవ్య ఉత్పత్తుల తయారీకి తిరుపతిలోని డిపిడబ్ల్యు స్టోర్స్‌లో ఇంజినీరింగ్ అధికారులు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. గోమందిరంలో గోప్రదక్షిణ, గోతులాభారం, గోవు ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో తెలిపారు.
బర్డ్ ఆసుపత్రి ఆవరణలో చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన సివిల్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. వైద్య పరికరాలు సమకూర్చుకున్నామన్నారు. వైద్యుల నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేశామని వివరించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆసుపత్రిని ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.