తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. ఇకపై శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్ లేదా మూడు రోజుల ముందు కరోనా నెగిటివ్ ఉన్నట్లు సర్టిఫికెట్ తేవాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కొవిడ్ నియంత్రణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కాగా ఈ నెల 25న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 31 వరకు రోజుకు ఎనిమిది వేల చొప్పున సర్వ దర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామన్నారు.
26 నుంచి తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లను నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. అక్టోబరు మాసం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఎల్లుండి ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.