Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం
, శుక్రవారం, 16 జులై 2021 (20:35 IST)
తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్ర‌వారంనాడు సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌. జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి పాల్గొన్నారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఈ ఉత్సవాన్ని నిర్వహించారు.
 
ముందుగా ఉదయం 7 నుండి 9.30 గంటల వరకు బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీ విష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. అనంతరం ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు, బంగారువాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదించారు.
 
అనంతరం శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు. శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఈవో, అద‌న‌పు ఈవో ఇతర ఉన్నతాధికారులు వెంట వచ్చారు. నాలుగు పట్టు వస్త్రాలను మూలవిరాట్టుకు అలంకరించారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరించారు.
 
తదనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాదవస్త్రంతో పరివట్టం కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి  నిత్యైశ్వర్యోభవ అని స్వామివారిని ఆశీర్వదించారు. ఆ తరువాత అర్చకులు శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారికి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయంగారికి, టిటిడి తరఫున కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి గారికి 'లచ్చన' అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలించారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాలచెంత ఉంచ‌డంతో ఆణివార ఆస్థానం ముగిసింది.
 
శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ
ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీ రంగ‌నాథ‌స్వామివారి ఆల‌య అధికారులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన గల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మఠం నుండి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా నాలుగు మాడ వీధుల ప్ర‌ద‌క్షిణ‌గా ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. 
 
వార్షిక లెక్కలు ప్రారంభించిన రోజు: టిటిడి ఈవో
ఈ ఉత్స‌వం అనంత‌రం ఆల‌యం వెలుపల ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తార‌ని చెప్పారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు వ‌చ్చింద‌న్నారు.
 
పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టిటిడి వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవ‌ని తెలిపారు. టిటిడి ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి - ఏప్రిల్‌ నెలలకు మార్చిన‌ట్టు వివ‌రించారు. సాయంత్రం పుష్ప‌ప‌ల్ల‌కీపై స్వామి, అమ్మ‌వారు నాలుగు మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తార‌ని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

16-07-2021 శుక్రవారం దినఫలాలు - నారాయణుడుని తెల్లని పూలతో ...