తిరుమలకు నడిచే వెళ్లాలనుకునే వారికి ఓ వార్త. తిరుమలకు వెళ్లే అలిపిరి నడకమార్గం మరో రెండు నెలలు పాటు మూసివేయబోతున్నారు. సెప్టెంబరు మాసం లోపుగా మెట్ల మార్గంలో అభివృద్ధి పనులు పూర్తి చెయ్యాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఇఓ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఫలితంగా, కాలినడకన శ్రీవారి దర్శనం చేసుకోవాలని భావించే భక్తులు సెప్టెంబరు వరకు శ్రీవారిమెట్టు నడక మార్గం ద్వారానే చేరుకునేందుకు భక్తులను అనుమతినిచ్చింది టీటీడీ. కాగా, మే నెలలో అలిపిరి నడక మార్గంలో మరమ్మత్తు పనులకు తిరుమల తిరుపతి దేవస్థానం నడుంబిగించింది. దీంతో అప్పటి నుంచి అలిపిరి మెట్లదారిని రెండు నెలలపాటు మూసివేసి పనులు చేపట్టారు.
అయితే, నిర్దేశిత సమయంలో పనులు పూర్తి కాకపోవడంతో మరో రెండు నెలలపాటు మెట్ల మార్గాన్ని మూసివేయాలని తాజాగా నిర్ణయించారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.
అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల రాకపోకల్ని అనుమతించడం లేదని తెలిపింది. ప్రత్యామ్నాయంగా భక్తులు శ్రీవారి మెట్టు నడకమార్గాన్ని వినియోగించుకోవాలని టీటీడీ సూచించింది. కరోనా లాక్ డౌన్ల నేపథ్యంలో తిరుమలకు భక్తుల రాక తగ్గిన నేపథ్యంలో ఆ సమయంలో మరమ్మత్తుల కార్యక్రమం చేపట్టాలని టీటీడీ నిర్ణయించి, ఆదిశగా పనులు షురూ చేసిన సంగతి తెలిసిందే.