శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సమాధిని ప్రవేశించడానికి ముందు రోజు రాత్రి బనగానపల్లెకి పూల కోసం బయలు దేరిన సిద్దయ్య అడవి మార్గం ద్వారా పోతుండగా కాషాయాంబరధారియైన ఒక మునిపుంగవుడు ఎదురు వచ్చి, నాయనా! ఎటు పోతున్నావు అని ప్రశ్నించాడు. అంతట సమాధానము చెప్పగా ఆ మహా పురుషుడు, నాయనా, సిద్దయ్యా! నీవు సగము దూరము కూడా నడవలేదు. నీవు బనగానపల్లె వెళ్లి పూలు కోసుకుని కందిమల్లయ్యపల్లె చేరేసరికి, అక్కడ మీ గురువుగారు తలపెట్టిన కార్యక్రమము పూర్తి అయిపోతుంది. ఈ అడవిలోని ముల్లు లేని మూడు పిడికిళ్ల ఆకులు తీసుకుని నీ గురువుని స్మరించుకో, ఆయన మహిమాన్వితుడే ఐతే అవి పూజకు పనికి వచ్చే పూలుగా మారతాయి అని తరుణోపాయం తెలియజేసాడు. ఆ మాటలు పట్టించుకోకుండా కొద్ది అడుగులు ముందుకు వేసి వెనుకకు చూడగా, ఆ ఋషీశ్వరుడు మరి కనిపించలేదు.
తన గురువుగారే ఋషీశ్వరుని రూపంలో వచ్చి కర్తవ్య బోధ చేసినట్లు భావించిన సిద్దయ్య, దగ్గరలోని కొలనులో స్నానం చేసి, స్వామివారిని స్మరించుకుంటూ ముళ్లు లేని ఆకులు సేకరించి జోలెలో వేయగా అవి మంచి వాసన వెదజల్లుతున్న పువ్వులుగా మారిపోయాయి. ఏమి స్వామివారి మహిమ! అనుకుంటూ తిరుగు ప్రయాణమయ్యడు. తిరుగు ప్రయాణములో మధ్యాహ్న సమయము దాటిన తరువాత, అడవి మార్గము గుండా ఒక వృద్ద బ్రాహ్మణుడు ఎదురు పడి, సిద్దయ్యా! స్వామివారి సమాధి ప్రవేశము దర్శించుకుని వస్తున్నాను. సమాధి ప్రవేశ సమయములో కూడా నిన్నే తలుచుకున్నారు అని పలికి ముందుకు సాగిపోయాడు. అయ్యో! గురువుగారి సమాధి ప్రవేశ సమయానికి చేరుకోలేకపోయానే అని దుఃఖిస్తూ కందిమల్లయ్యపల్లె సిద్దయ్య చేరుకున్నాడు.
సిద్దయ్య స్వామివారి చెంత కైవల్యప్రాప్తికై పూనుకొనుట
సిద్దయ్య కందిమల్లయ్యపల్లె లోని మఠమునకు చేరుకుని తలుపులు ఎంత కొట్టినా, తెరవబడలేదు. అప్పుడు ఆగకుండా తలుపులను బాదుతూ తలుపులు తీయమని ఘోషించగా, లోపలి నుండి పనివాడు బయటకు వచ్చి, స్వామివారు సమాధి చెందిన తరువాత తమరికి ఇక్కడేం పని. ఇక మీ గ్రామానికి వెళ్లండి. ఇది గోవిందమ్మ గారి ఆజ్ఞ అని చెప్పి తలుపులు మూసుకున్నాడు. స్వామివారు ఉన్నంతకాలం ఇంటిలో మనిషిలా తిరిగిన తనను ప్రవేశానికి కూడా అనుమతి నిరాకరించడంతో దుఃఖాన్ని ఆపుకోలేక, ద్వారము వద్దే శీర్షాసనం వేసి వాయువును బంధించి కైవల్యము పొందడానికి పూనుకున్నాడు. అది చూసిన సేవకులు గాబరాపడుతూ గోవిందమ్మ గారి చెవిని వేసారు.
పరిస్థితి విషమంగా మారడంతో, ఆమె పరుగున వచ్చి సిద్దయ్య ప్రయత్నాన్ని ఉపసంహరింపజేసి, సమాధి వద్దకు సిద్దయ్యను అనుమతించారు. సిద్దయ్య వీరబ్రహ్మేంద్రస్వామి వారి సమాధి వద్దకు చేరుకుని, తెచ్చిన పూలను సమాధిపై అలంకరించి, నేనేమి తప్పు చేసాను స్వామీ, తమరి సమాధి ప్రవేశ సమయమునకు నన్ను లేకుండా చేసారు. ఇప్పుడు మీరు తిరుగాడిన చోట నాకు చోటు లేదంటున్నారు. మీ పాదపద్మముల వద్ద సేవ చేసుకుంటూ తమరి ఆజ్ఞలు అమలు చేయడం తప్ప, నాకేమీ తెలియదు. ఎక్కడికి పోవాలి. మీ సాన్నిహిత్యం లేని జీవితము నాకు వద్దు అని విలపిస్తూ, అక్కడే పడి ఉన్న గండకత్తెరను తీసుకుని మెడను దానికి ఇరికించబోయాడు. కాని అది తునాతునకలై నేల రాలింది. ఈ విధంగా కూడా నన్ను నీ దగ్గరకి చేరనివ్వవా స్వామీ! మీరు లేని ఈ దేహము నాకు వద్దు. ఇక్కడనే కుంభక యోగము ద్వారా సహస్రారమును ఛేదించుకుని బ్రహ్మైక్యమయిపోతాను. మీ విరాట్ స్వరూపములో లీనమై పోతాను అని శపధం చేసాడు. అంతట, నాయనా సిద్దా! అన్న పిలుపు వినిపించింది. సిద్దయ్య చుట్టూ పరికించి చూసాడు. ఎవ్వరూ కనబడలేదు. మళ్లీ తన నిర్ణయాన్ని అమలు చేయడానికి ఉద్రుక్తుడయ్యాడు.
సిద్దయ్యకు వీరబ్రహ్మేంద్రస్వామివారి విరాట్ రూపమును దర్శింపజేయుట
వీరబ్రహ్మేంద్ర స్వామి వారు దరి లేని జీవితము వ్యర్థమని తలంచి మల్లీ ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డాడు సిద్దయ్య. ఈసారి గట్టిగా, సిద్దా! సిద్దా! తొందరపాటు నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నావు! సమాధికి అడ్డంగా ఉన్న పలకను తొలగించు అంటూ స్వామి వారి మాటలు స్పష్టంగా వినిపించాయి.
గురుదేవులు ఆదేశం స్పష్టంగా వినబడడంతో, మహదానందంతో సమాధిపై ఉంచిన రాతి పలకను తొలగించాడు. మరుక్షణమే మహా తేజస్సుతో ప్రకాశిస్తూ వీరబ్రహ్మేంద్రస్వామి వారు బయటకు వస్తూ కనిపించారు. సిద్దయ్య స్వామివారి పాదాలపై పడి భావోద్వేగంతొ ఆనందభాష్పాలతో స్వామివారి పాదాలను అభిషేకించాడు.
నాయనా సిద్దా! ఇటువంటి పనికి పూనుకోవడం సబబా! నీవు చేయవలసిన పని ఇంకా చాలా మిగిలి ఉంది అని చెబుతూ సహస్ర హస్తాలతో, సహస్ర శీర్షాలతో, బ్రహ్మండమంతా తన దేహములో ఇమిడియున్న విరాట్ స్వరూపమును సిద్దయ్యకు దర్శింపచేసారు. తరువాత, తన పాదుకలు, దండము, చేతి బెత్తెము, శిఖాముద్రిక సిద్ధయ్యకు ప్రసాదించి, నీ తల్లిదండ్రుల వద్దకు పోయి, వివాహము చేసుకొని, రాజయోగివై ధర్మ ప్రబోదము చేస్తూ వర్ధిల్లు. నీకు పెదవీరయ్య అను సుపుత్రుడు కలిగి నీవు సమాధి ప్రవేశము చేసిన తరువాత నీ లాగే ధర్మ ప్రచారం చేస్తూ జీవిస్తాడు. నీవు కూడా నీ స్వగ్రామములో మఠము నెలకొల్పుతావు, చాలామంది కపట సాధువులు ఎదురు బడతారు. వారిని నమ్మకు అని పలికి తన రూపాన్ని వీరబ్రహ్మేంద్రస్వామి వారు ఉపసంహరించుకున్నారు. రాజయోగ నియమాలు, కలి లోని మాయలు మర్మములు సిద్ధయ్యకు వివరించి, మరల సమాధి ప్రవేశము గావించారు.
వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆదేశం మేరకు సిద్దయ్య సమాధి మీది పలక యధాతధంగా అమర్చి, గోవిందమ్మవారి వద్దకు వెళ్లి, జరిగినిదంతా చెప్పి, గోవిందయాచార్యులకు, పోతులూరి ఆచార్యులకు కూడా చెప్పి గురువర్యుల ఆజ్ఞను అమలుచేయడానికి తన స్వగ్రామానికి బయలుదేరాడు.
దొంగల బారి నుండి సిద్దయ్యను స్వామివారు కాపాడుట:
సిద్దయ్య గోవిందమ్మ గారి దగ్గర సెలవు తీసుకుని, గోవిందయ్యాచార్యులకు, వీరయ్యాచార్యులకు చెప్పి అడవి మార్గం గుండా తన స్వగ్రామమైన మడమాల బయలుదేరాడు. అలా వెళ్తుండగా వెనుక నుండి పెదబుచ్చయ్య నాయుడు, చిన బుచ్చయ్యనాయుడు అనే ఇద్దరు గజదొంగలు కర్రలతో దాడిచేసారు. అదే సమయంలో గాండ్రించుకుంటూ ఓక పెద్దపులి వాళ్లపై లంఘించడంతో వారు కాళ్లకు బుద్ది చెప్పి పరుగులు తీసారు. వారు దూరంగా వెళ్లేవరకు వెంట తరిమి తరిమి తరువాత ఆ పెద్దపులి అదృశ్యమయ్యింది. ఈ హఠాత్పరిణామానికి ఆశ్చర్యంతో, తన దగ్గర విలువైన వస్తువులు గాని, డబ్బులు గాని లేనప్పుడు దొంగలకు తనపై దాడి చేయడానికి కారణం గురించి తెలుసుకోగా, తన దగ్గర ధనము కన్నా విలువైన గురువర్యులు ప్రసాదించిన పాదుకలు, దండము, చేతి బెత్తెము, శిఖాముద్రికలేనని, వాటి కోసం గోవిందయాచార్యులు పన్నిన పన్నాగమే దొంగల దాడి అని తెలిసింది. వచ్చిన పెద్దపులి వారు పారిపోయిన వెంటనే అదృశ్యం కావడంతో, ఆ నీచ కుయుక్తిని స్వామి వారే పెద్దపులి రూపంలో వచ్చి విఫలం చేసారని అతను భావించి, వీరబ్రహ్మేంద్రస్వామి వారు సమాధి ప్రవేశము తరువాత కూడా తన వెన్నంటి ఉండి కనురెప్పలా కాపాడుతున్నందుకు, తన్మయత్వంతో స్వామివారి గేయాలు ఆలపిస్తూ ఇంటికి చేరుకున్నాడు.
ఇంటికి చేరుకున్న పుత్రుని చూసి తలిదండ్రులు ఆనందంభరితులయ్యారు. వివాహము చేసుకొనుటకు సమ్మతి తెలపడంతో వారి ఆనందానికి అవధులు లేవు. తల్లిదండ్రులు చూసిన కన్యను వివాహము చేసుకుని, స్వామివారు ప్రసాదించిన వస్తువులను దేవుని పీఠముపై పెట్టి, వాటిలోనే వీరబ్రహ్మేంద్రస్వామిని చూసుకుంటూ, పూజలు చేస్తూ స్వామివారి ద్వారా సంక్రమించిన జ్ఞానాన్ని విస్తరింప జేస్తూ గడిపసాగాడు. కాలక్రమమున అతను ఒక పీఠమును ఏర్పాటు చేసాడు. అతనికి జన్మించిన పుత్రునికి పెదవీరయ్య అని నామకరణం చేసాడు.
గోవిందమ్మ గారు పనిపెంట, మునిమడుగు గ్రామ విశ్వబ్రాహ్మణులను శపించుట:
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జీవ సమాధి పొందిన తరువాత కొంతకాలానికి, మఠాద్యక్షులైన గోవిందయాచార్యులు, తనకు బదులు సోదరుడైన పోతులూరాచార్యులవారిని ధర్మ ప్రచారము నిమిత్తమై సంచారమునకు పంపించారు. శ్రీ పోతూలూరాచార్యులవారు పనిపెంట అనే గ్రామానికి చేరుకుని, ఆ గ్రామంలోని విశ్వబ్రాహ్మణులకు తన రాకను తెలియజేయమని సేవకుని ద్వారా కబురు పంపాడు. అంతట ఊరిలోని విశ్వ బ్రాహ్మణులు, వీరబ్రహ్మేంద్రస్వామి వారు సమాధి ప్రవేశము చేసినా, ఆతని ధర్మపత్నియైన గోవిందమ్మ పసుపుకుంకుమలు తీయనందుకు ఆక్షేపణ తెలియజేసి, సంప్రదాయాన్ని పాటించనందుకు నిరసనగా తాము పోతులూరాచార్యులను ఆదరించలేమని ఆ సేవకునికి చెప్పి పంపించేసారు.
శ్రీ పోతులూరి ఆచార్యులకు ఊరి వారితో గొడవెందుకని, మనిమడుగు గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామవిశ్వబ్రాహ్మణులు కూడా గోవిందమ్మ గారు సుమంగళి చిహ్నములు తీయనందున పోతులూరాచార్యులను గురువుగా గౌరవించి ఆదరించలేమని చెప్పారు. పోతులూరయ్య కోపోద్రిక్తుడై ఆలోచన కోల్పోయి సంచారమును అక్కడే ముగించుకుని, ఇంటికి వెళ్లి తల్లి గారిని దుర్భాషలాడనారంబించాడు. సమాధిలో ప్రవేశించిన తరువాత కూడా సుమంగళి చిహ్నాలను తీయకపోవటం వలన అవమానం పడవలసి వచ్చినదని, వెంటనే వాటిని తొలగించమని పట్టుబట్టాడు.
గోవిందమ్మ కోపితురాలై పనిపెంట, మునిమడుగు గ్రామములో ఉన్న విశ్వబ్రాహ్మణులు కష్టాలపాలవ్వాలని శపించారు. దానికి తప్పు మనలో ఉంచుకుని, వారిని శపించడం ఏమిటని తల్లిని గద్దించాడు. గోవిందమ్మ బాధపడుతూ, తనను సుమంగళిగానే ఉండమని తన పతిదేవుడు సెలవిచ్చారని, తండ్రిగారు సమాధి ప్రవేశము చేసినా ప్రాణముతోనే ఉన్నారని నచ్చచెప్ప ప్రయత్నించింది. నేను సమాధిని తెరుస్తాను, తండ్రిగారు జీవం చాలిస్తే మెట్టెలు, మంగళం సూత్రాలు తీయవలసి ఉంటుంది అని సమాధి వద్దకు వెళ్ళబోయాడు. గోవిందమ్మ అడ్డుపడి, నాయనా మీ తండ్రిగారి శక్తిసామర్థ్యాలను తక్కువ అంచనా వేస్తున్నావు. సమాధి జోలికి వెళ్లడం మంచిదికాదు. మన శ్రేయోభిలాషైన సిద్ధయ్యను సంప్రదించి ఏ నిర్ణయమైనా తీసుకో అని నచ్చచెప్పి పోతులూరయ్యను సిద్దయ్య వద్దకు పంపించింది.
వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పోతులూరయ్యను శపించుట
తల్లి వారించడంతో తండ్రి సమాధిని వెలికితీసి చూడాలన్న ఆలోచనను వాయిదా వేసుకుని, మడమాల గ్రామమునకు వెళ్లి, సిద్దయ్యను కలిసి, తనకు పనిపెంట, మునిమడుగు గ్రామాలలో జరిగిన అవమానాన్ని వివరించి, తన తండ్రి సమాధిపైనున్న పలకను తొలగించి, వారి స్థితిని తెలుసుకుని తల్లి గారి చేత సుమంగళి చిహ్నాలను తొలగింపించాలన్న తన ఆంతర్యాన్ని తెలియజేసాడు పోతులూరయ్య. అంతట సిద్ధయ్య తనకు అనుభవమైన వివిధ మహిమలు వివరించి, స్వామివారి ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్ళడం, అతనిని పరీక్షించడం మంచిది కాదని వివరించాడు. సిద్దయ్య చెప్పినదంతా విని కందిమల్లయ్య పల్లెకు తిరిగి చేరుకున్నాడు.
పోతూలూరయ్య తిరిగి వచ్చి మిన్నకుండటంతో సమస్య సమసిపోయిందని గోవిందమ్మ గారు భావించారు. కాని, పోతులూరయ్యలో దూరిన సంశయమనే పురుగు ఊరుకోనివ్వలేదు. ఒక రోజు రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయములో ఒక్కడూ పలుగుతో సమాధిపైనున్న రాతిని తొలగించి, లోపలికి ప్రవేశించాడు. వీరబ్రహ్మేంద్రస్వామి వారి సమాధి ప్రవేశము చేసిన రోజు వెలిగించిన దీపపు వెలుగులో నిశ్చలంగా పద్మాసనంలో కూర్చున్న తండ్రి గారు కనిపించారు. ఎంత గట్టిగా పిలిచినా పలికక పోవడంతో భుజాలు పట్టుకొని కుదిపాడు. తపోభంగమవడంతో వీరబ్రహ్మేంద్రస్వామి కోపితుడై, నీవు చేసిన తప్పుకు ప్రతిగా అల్లాడుపల్లెకు వెళ్లి, అక్కడకు సమీపాన ఉన్న కొండపైన ఒక చింతచెట్టు ఉన్నది. దానికింతవరకు పూత లేదు. ఆ చింత చెట్టు నీడన పన్నెండు సంవత్సరములు, తపస్సు చేసిన ఒక కాయ పుట్టి చేతిలో పడుతుంది. అప్పుడు నీ తపస్సు ఫలించినట్లు పరిగణింప బడుతుంది. అంతవరకు తపస్సు చేసి తిరిగి కందిమల్లయ్యపల్లెకు వచ్చి ధర్మబద్దముగా నడుచుకొని సమాధి చెందు అని శపించారు. అంతట పోతులూరయ్య బయటకు వచ్చి సమాధిపై పలకను యధాతధముగా కప్పి, జరిగినిదంతా తల్లికి వివరించి భార్యాసమేతముగా అల్లాడుపల్లెకు చేరుకున్నాడు.
పోతులూరయ్య బయలు దేరిన తరువాత, వీరబ్రహ్మేంద్రస్వామివారు పోలేరమ్మకు చెప్పిన విషయం జ్ఞాపకము వచ్చి, పోలేరమ్మను తలుచుకోగా, పోలేరమ్మ ప్రత్యక్షమయింది. తన పుత్రుడి విషయం చెప్పి, అక్కడ కాపలాగా ఉండమని గోవిందమ్మ చెప్పింది. గోవిందమ్మ గారి కోరిక మేరకు, పోతులూరయ్య వెంట వెళ్లి, రోజూ పాలు పోస్తూ, అవసరమైన సహాయం చేస్తూ కాపలాగా అమ్మవారు ఉండేది. పన్నెండు వత్సరములు తరువాత చింతచెట్టుకు కాయ కాచి తపస్సులో నిమఘ్నమైయున్న పోతులూరయ్య చేతిలో పడడంతో, తపస్సు సిద్దించినట్లు గ్రహించి కందిమల్లయ్యపల్లెకు తిరిగి వచ్చి ధర్మబద్దమైన జీవితం గడిపాడు. తపస్సు ఫలించిన తరువాత తిరుగు ప్రయాణమవుతున్నప్పుడు పోలేరమ్మ పోతులూరయ్యను కందిమల్లాయపల్లె గ్రామములో ఉండడానికి అవకాశమిమ్మని అడిగినది, అయితే పోతులూరయ్య మాత్రం అమ్మవారిని గ్రామ సరిహద్దులలో ఉండి పూజలందుకుంటూ ఉండమని చెప్పాడు.
ఈశ్వరమ్మ గారి ప్రస్థానం:
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తెలియజేసిన ప్రకారం, గోవిందయాచార్యులవారికి ఐదుగురు కుమార్తెలు కలిగారు. వారిలో పెద్దకుమార్తెన ఈశ్వరమ్మ చిన్న తనము నుండి దైవ చింతనలో గడుపుతూ, ఆధ్యాత్మిక జ్ఞానమును సముపార్జించారు. వివాహము చేసుకొనకుండా జీవితమును ధర్మప్రచారమునకు అంకితము చేసారు. గోవిందయ్యచార్యులు గారు సమాధి చెందిన తరువాత పూర్తిగా ధర్మ ప్రచార బాధ్యతను చేబట్టి, సంచారము చేస్తూ జనులను సత్ కర్మల వైపు నడిపించారు. ఆమె ఉపన్యాసాలలో దొంగ సాధువుల గురుంచి హెచ్చరికలు ఉండేవి. తన మహిమలు చూపుతూ జనులను ఆకర్షిస్తూ వారిని ధర్మమార్గములో నడిపించారు.
ఒక రోజు ఒక గ్రామములో ఆమె యొక్క అనుగ్రహ భాషణం ఏర్పాటు చెయ్యబడింది. తదనంతరం వచ్చిన వారందరికీ విందు భోజనాలేర్పాటు చేయబడ్డాయి. ఈశ్వరమ్మ గారి భాషణం, దర్శనం అయిపోయాయి. భోజనాలు వడ్డించడానికి సమయమాసన్నమయినది. పొరుగూరికి నెయ్యి కోసం పంపిన వ్యక్తి ఇంకా రాలేదు. నిర్వాహకులు గాబరా పడి ఈశ్వరమ్మకు విషయం తెలియజేసారు. ఆమె చలించకుండా, ఊరిలోని కొలనుకు పోయి కడవను ముంచి నేను చెప్పానని చెప్పి అరువు అడగండి అని చెప్పి పంపారు. ఆమె చెప్పినట్లు కొలనులో కడవను ముంచితే, నీటికి బదులు నెయ్యి కడవలో వచ్చింది. దానితో విందు కార్యక్రమము నిర్విఘ్నుంగా కొనసాగింది. కొంతసేపటికి పక్క ఊరు వెళ్లినవాడు నెయ్యను తీసుకుని వచ్చాడు. ఆ నెయ్యిను ఈశ్వరమ్మ ఆజ్ఞానుసారం కొలనులో పోసి అప్పు తీర్చారు. ఇలాంటి మహిమలు ఎన్నో ఆమె ప్రదర్శించారు. కొంతకాలానికి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిలాగా ఆమెకూడా సమాధిలో ప్రవేశించిరి. (సమాప్తం)