సంకష్ట హర చతుర్థి అనేది విఘ్నేశ్వరుడి పూజకు అంకితం చేయబడిన రోజు. సంకష్టహర చతుర్థి అంటే గణపతికి 32 స్వరూపాలున్నాయని ముద్గల పురాణలో చెప్పారు. అందులో 32వ స్వరూపం అంటే ఆఖరి స్వరూపమే ఈ సంకష్టహర గణపతి. ప్రతి చాంద్రమాన నెలలో కృష్ణ పక్షం నాల్గవ రోజున వస్తుంది.
సంకష్ట చతుర్థి రోజులలో వినాయక పూజ సంకటాలను నివృత్తి చేయగలదు. భక్తులు ఈ పవిత్ర దినాన్ని ఉత్సాహంగా జరుపుకుంటారు. రోజంతా ఉపవాసం వుండి సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాత వారు ఉపవాసాన్ని ముగించారు. పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పుడు సంకటహర వ్రతం చేస్తే అద్భుత ప్రయోజనాలుంటాయి.
నరదృష్టి, ఆర్థిక సమస్యలు, సంతానం లేమి, గృహ వసతి లేకపోయినా, దీర్ఘకాలిక వ్యాధులున్నా ఈ వ్రతం ఆచరించడం మంచిది. సంకష్టహర చతుర్థి రోజు ఉదయం పూట మాత్రమే కాకుండా సాయంత్రం పూట కూడా గణపతి పూజ చేయాలి. ఉదయం నల్లరాయితో చేసిన గణపతిని పూజిస్తే సాయంత్రం శ్వేతార్క గణపతిని పూజిస్తే మంగళకరం. ఇంకా ఆలయంలో వినాయకుడికి జరిగే అభిషేకాలు, యజ్ఞాలలో పాల్గొనడం మంచిది.
ఈ సందర్భంగా గరిక, ఉండ్రాళ్లను వినాయకునికి సమర్పిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. శనివారం సంకష్ట హర చతుర్థి రావడంతో ఈ రోజున గణపతి పూజ శనీశ్వర దోషాలను తొలగిస్తుంది. ఇంకా ఈ రోజున అన్నదానం చేయడం, వస్త్ర దానం చేయడం ద్వారా శని దోషాల నుంచి విముక్తి పొందవచ్చు.