ప్రతినెల కృష్ణ పక్షంలోని ఎనిమిదో రోజున అంటే కృష్ణ పక్ష అష్టమి నాడు కాలాష్టమి వస్తుంది. శివుడు ఉగ్రరూపానికి ప్రతీకే కాలభైరవుడు. అందుకే కాలాష్టమి నాడు వీరిద్దరిని పూజిస్తారు. ఈ సంవత్సరం అష్టమి తిథి 2025 అక్టోబర్ 13న మధ్యాహ్నం 12:24 గంటలకు ప్రారంభమై 2025 అక్టోబర్ 14న ఉదయం 11:10 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం, కాలాష్టమి సోమవారం (అక్టోబర్ 13) నాడు జరుపుకోనున్నారు.
ఈరోజున కాల భైరవుని కథను వినడం, శివుడిని ప్రార్థించడం శుభప్రదంగా భావిస్తారు. కాల భైరవుని వాహనంగా చాలా మంది నల్లకుక్క అని భావిస్తారు. అందుకే ఈరోజున దానికి పాలు, పెరుగు, స్వీట్స్ వంటి ఆహారంగా పెట్టడం వల్ల మీకు మంచి జరుగుతుంది. బ్రాహ్మణులకు అన్నదానం లేదా వస్త్రదానం లేదా డబ్బుదానం చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ఈరోజున పితృదేవతలను ఆరాధించడం వల్ల వారి ఆత్మకు చేకూరుతుంది.
సాయంత్రం వేళ భక్తులు కాలభైరవుని ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. దాదాపుగా ప్రతి శివాలయంలో కాలభైరవుని విగ్రహం కూడా ఉంటుంది. కాలభైరవుని సమక్షంలో ఆవ నూనెతో దీపాన్ని వెలిగించాలి. శివ స్తోత్రం, కాలభైరవాష్టకం పఠించాలి. అనంతరం 11 ప్రదక్షిణలు చేయాలి. కాల భైరవునికి కొబ్బరికాయ, నల్ల బెల్లం, రొట్టెలు వంటివి ప్రసాదంగా సమర్పించాలి. కొన్ని ప్రాంతాల్లో భైరవునికి మద్యం కూడా నైవేద్యంగా సమర్పిస్తారు.
భక్తిశ్రద్ధలతో కాలాష్టమి పూజ చేసిన వారికి ఆరోగ్యం, శ్రేయస్సు కలుగుతాయి. కాలభైరవుని అనుగ్రహంతో రాహు, కేతు దోషాల నుంచి విముక్తి లభిస్తుందని శాస్త్ర వచనం. అంతేకాదు ప్రతి నెలా కాలాష్టమి వ్రతాన్ని ఆచరించే వారు దుష్టశక్తుల ప్రభావం నుంచి బయటపడతారని పండితులు చెబుతున్నారు. కాలాష్టమి వ్రతాన్ని ఆచరించిన వ్యక్తికి దుఃఖాలు, అనారోగ్యాలు, శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది.