మన దేశంలో పెద్దమొత్తంలో డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి. యూపీఐ వినియోగం విస్తృతమైంది. ఈ క్రమంలోనే పాఠశాలల్లో ఫీజుల వసూలు ఈ ప్రక్రియను కూడా ఆధునీకరించాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలను కోరింది. పారదర్శకతను పెంచడంతోపాటు ఫీజుల చెల్లింపును సులభతరం చేసేందుకు యూపీఐ వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించింది. యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ చెల్లింపులకు ఆదరణ పెరుగుతున్న వేళ ఇటువంటి ప్రకటన చేయడం ఇదే తొలిసారి.
ఆధునిక విధానాలు అవలంభించడం ద్వారా పాఠశాలల నిర్వహణను సులభతరం చేయడం, ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో యూపీఐ వినియోగాన్ని ప్రోత్సహించాలని కోరుతూ రాష్ట్రాలు, సంబంధిత విభాగాలకు కేంద్ర విద్యాశాఖ లేఖ రాసింది. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్), నవోదయ విద్యాలయ సమితి (ఎన్వీఎస్) వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. అడ్మిషన్, ఎగ్జామ్ ఫీజుల వసూలుకు వీలు కల్పించే డిజిటల్ విధానాలను అన్వేషించి అమలు చేయాలని సూచించింది.
నగదు ఆధారిత చెల్లింపుల నుంచి డిజిటలు మారడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ తన ప్రకటనలో పేర్కొంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఈ విధానం అనుకూలంగా ఉంటుందని, పారదర్శకత సాధ్యమని తెలిపింది. ఫీజుల చెల్లింపునకు స్కూల్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే కట్టొచ్చని చెప్పింది. 'డిజిటల్ భారత్' సాధన దిశగా ఇటువంటి చర్యలు తోడ్పడతాయని వెల్లడించింది. ఆర్థిక అక్షరాస్యత మెరుగుదల, తద్వారా డిజిటల్ లావాదేవీలు మరింత విస్తృతం అవుతాయని పేర్కొంది.