అహంకారం కూడా అలాంటిదే... రేయింబవళ్లు ప్రయత్నించినా...

మనిషికి అహంకారము కారణంగానే భగవద్దర్శనం కావడం లేదు. భగవంతుని ఇంటి తలుపులకు ఎదురుగా ఈ అహంకారమనేది చెట్టు బోదెలా పడి ఉంది. ఈ బోదెను దాటకుండా ఆయన ఇంట్లో ప్రవేశించడం సాధ్యం కాదు. ఒకప్పుడు ఒకడు భూతాలను లొంగదీసుకొనే శక్తి గడించాడు. ఆ శక్తి కలిగాక అతడు పిలవగ

శుక్రవారం, 17 ఆగస్టు 2018 (15:50 IST)
మనిషికి అహంకారము కారణంగానే భగవద్దర్శనం కావడం లేదు. భగవంతుని ఇంటి తలుపులకు ఎదురుగా ఈ అహంకారమనేది చెట్టు బోదెలా పడి ఉంది. ఈ బోదెను దాటకుండా ఆయన ఇంట్లో ప్రవేశించడం సాధ్యం కాదు. ఒకప్పుడు ఒకడు భూతాలను లొంగదీసుకొనే శక్తి గడించాడు. ఆ శక్తి కలిగాక అతడు పిలవగానే భూతం అతడి ఎదుట ప్రత్యక్షమై ఇలా అంది. 
 
నేనిప్పుడు ఏం పని చేయాలో చెప్పు. నువ్వు నాకు ఏ పని అప్పగించనట్లయితే ఆ మరుక్షణమే నీ మెడను త్రుంచి వేస్తాను అని హెచ్చరించింది. దాంతో ఆ వ్యక్తి తనకు కావలసిన పనులన్నింటిని ఆ భూతం ద్వారా ఒక్కొక్కటిగా చేయించుకున్నాడు. చివరకు ఆ భూతానికి ఇవ్వడానికంటూ అతడి వద్ద ఏ పని లేకుండా పోయింది, ఇప్పుడు నీ మెడ త్రుంచి వేస్తాను అంది ఆ భూతం.
 
పాపం అప్పుడు ఆ వ్యక్తికి ఏం చేయాలో పాలుపోలేదు. ఒక్కక్షణం ఆగు. నేనిప్పుడే వస్తాను అని చెప్పి అతడు తన గురువు వద్దకు పరుగుపరుగున వెళ్లాడు. ఆయనకు ఈ ఉదంతాన్ని తెలిపి అయ్యా.... నేనొక పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాను. నేను ఇందులో నుండి బయటపడటం ఎలాగో సెలవియ్యండి అన్నాడు. 
 
గురువుగారు అతనికి వంకరటింకరగా ఉన్న వెంట్రుకను ఒకదానిని ఇచ్చారు. దానిని ఆ భూతానికి ఇచ్చి తిన్నగా చెయ్యమని చెప్పమన్నారు. ఆ భూతం రాత్రింబవళ్లు ఆ వెంట్రుకను తిన్నగా చెయ్యడంలోనే నిమగ్నమయ్యింది. కానీ ఆ వెంట్రుక ఎప్పటికైనా తిన్నగా అయ్యేదేనా... అది ఎలా వంకరగా ఉండేదో అలాగే ఉంది. అహంకారం కూడా అలాంటిదే. క్షణంలో తొలగిపోయినట్లు ఉంటుంది. మళ్లీ అంతలోనే ప్రత్యక్షమవుతుంది. అహంకారాన్ని త్యజించకుండా భగవత్కృప లభించదు. మనలోని అహాన్ని తొలగించుకున్నట్లయితే భగవంతుని సానిధ్యం తప్పక లభిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం సాయిబాబా ప్రార్థనా మహిమాన్వితం...