Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ మూడవ దొంగలా వుంటే అన్నీ సాధ్యం... ఏంటవి?

సృష్టి స్థితి లయాలను నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు ఆయనను సగుణ బ్రహ్మం, ఆద్యాశక్తి అంటారు. మూడు గుణాలకు అతీతుడైనప్పుడు నిర్గుణబ్రహ్మం, మనోవాక్కులకు అతీతుడుగా పేర్కొంటారు. అతడే పరబ్రహ్మం. మనిషి ఆయన మాయలో పడి స్వస్వరూపాన్ని మరచిపోతాడు. అతడు తన జనకుని అనంత ఐశ

ఈ మూడవ దొంగలా వుంటే అన్నీ సాధ్యం... ఏంటవి?
, బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (18:24 IST)
సృష్టి స్థితి లయాలను నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు ఆయనను సగుణ బ్రహ్మం, ఆద్యాశక్తి అంటారు. మూడు గుణాలకు అతీతుడైనప్పుడు నిర్గుణబ్రహ్మం, మనోవాక్కులకు అతీతుడుగా పేర్కొంటారు. అతడే పరబ్రహ్మం. మనిషి ఆయన మాయలో పడి స్వస్వరూపాన్ని మరచిపోతాడు. అతడు తన జనకుని అనంత ఐశ్వర్యానికి వారసుడననే సంగతి విస్మరిస్తాడు.
 
ఆయన మాయా త్రిగుణాత్మికం. సత్వ రజః తమస్సులనే మూడు గుణాలే బందిపోటులు. జ్ఞానాన్ని హరించి స్వస్వరూపాన్ని మరపింప చేస్తాయి. సత్వగుణం మాత్రమే భగవత్ మార్గాన్ని చూపుతుంది. కాని ఈ సత్వగుణం కూడా భగవంతుని వద్దకు చేర్చలేదు. దీనికి ఒక కథ చెబుతాను వినండి. ఒకప్పుడు ఒక ధనికుడు ఒక అరణ్యంలో పోతున్నప్పుడు ముగ్గురు దొంగలు చుట్టుముట్టి, అతణ్ణి నిలువుదోపిడీ చేశారు. ఆ తరువాత ఆ దొంగలలో ఒకడు ఇతణ్ణి ప్రాణాలతో విడిచి పెట్టడంలో ప్రయోజనం ఏమిటి? చంపి పారేద్దాం అంటూ కత్తి దూసి అతణ్ణి వధింప ఉద్యక్తుడైనాడు. అప్పుడు రెండవ దొంగ అడ్డుపడి ఇలా అన్నాడు.
 
ఇతణ్ణి చంపితే మనకు ఏం ప్రయోజనం. ఇతణ్ణి కట్టిపడేసి ఇక్కడే వదిలిపెట్టి మనం వెళ్ళిపోదాం. ఇక అతడు పోలీసులకు ఏమి తెలుపలేడు. అతడు సూచించిన విధంగా దొంగలు ఆ ధనికుని తాళ్ళతో కట్టివేసి తమ దారిన వెళ్ళిపోయారు. కొంతసేపు గడిచాక మూడవ దొంగ వెనక్కు తిరిగివచ్చి ఆ ధనికునితో ఇలా అన్నాడు. అయ్యో పాపం మీకు దుఃఖం కలిగింది కదా. మిమ్మల్ని బంధవిముక్తుని చేస్తాను. ఇలా అంటూ ఆ మూడవదొంగ ఆ ధనికుని కట్లు విప్పి అతణ్ణి అరణ్యం దాటించాడు. రహదారి సమీపంలోకి వచ్చాక ఆ దొంగ ధనికునితో ఈ మార్గం ద్వారా మీరు వెళ్ళారంటే మీ ఇల్లు సులభంగా చేరుకుంటారు అన్నాడు. 
 
అప్పుడు ఆ ధనికుడు నువ్వు కూడా నాతో రావాలి. నువ్వు నాకు ఎంతో ఉపకారం చేశావు. మా ఇంటికి నువ్వు వస్తే మేమంతా ఎంతో సంతోషిస్తాం అన్నాడు. అప్పుడువ ఆ దొంగ... లేదు నేను మీ ఇంటికి రావడం కుదరదు. పోలీసులు నన్ను పట్టుకుంటారు అంటూ ఆ ధనికునికి దారి చూపి తన దారిన వెళ్లిపోయాడు.
 
ఇతణ్ణి ప్రాణాలతో విడిచి పెట్టడంలో ప్రయోజనం ఏమిటి, చంపి పారేద్దాం అన్న మొదటి దొంగ తమోగుణానికి ఉదాహరణ. తమోగుణంచే వినాశం కలుగుతుంది. సంసారంలో బంధించి వివిధ కార్యకలాపాలలో చిక్కువడ చేసే రజోగుణమే రెండవ దొంగ. రజస్సు భగవంతుని విస్మరింపచేస్తుంది. కేవలం సత్వగుణం మాత్రమే భగవంతుని చేరుకునే మార్గం చూపుతుంది. దయ, ధార్మికత, భక్తి మొదలైన సుగుణాలన్ని సత్వగుణం ద్వారానే కలుగుతాయి. అంటే మూడవదొంగలా అన్నమాట. మెట్ల వరుసలోని ఆఖరి మెట్టు వంటి సత్వగుణం కూడా వదిలి గుణరహితం అయినప్పుడు పరబ్రహ్మాన్ని చేరుకుంటాడు. పరబ్రహ్మమే మానవుని స్వధామం. త్రిగుణాతీతుడు కాకున్నంతవరకు ఎవరు బ్రహ్మజ్ఞానాన్ని సంతరించుకోలేరు.
 
- శ్రీరామకృష్ణ పరమహంస

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ (బుధవారం) రాశిఫలితాలు.. సత్యదేవుని పూజించినా...