Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ వ్యాధితో బాధపడుతూ కూడా వార కాంతల ఇళ్లకు తీసుకెళ్లమని భార్యను వేధిస్తుండేవాడు...

ఆ వ్యాధితో బాధపడుతూ కూడా వార కాంతల ఇళ్లకు తీసుకెళ్లమని భార్యను వేధిస్తుండేవాడు...
, బుధవారం, 25 సెప్టెంబరు 2019 (20:05 IST)
దుర్వాసుడికి ముక్కు మీదే కోపం వుండేది. సహనం వుండేది కాదు. పరమ శివుని అంశతో పుట్టాడని ప్రతీతి. దుర్వాసుడి పుట్టుక గురించి పురాణాలలో అనేక కథలున్నాయి. ఒకసారి బ్రహ్మకూ, శివుడికి మధ్య మాటా మాటా పెరగడంతో అది పెద్ద యుద్ధంగా మారింది. పరమేశ్వరుడు ప్రళయ రుద్రుడయ్యాడు. ఆయన కోపాగ్ని జ్వాలలకు దేవతలు తాళలేకపోయారు. బ్రహ్మ పలాయనం చిత్తగించాడు. 
 
భవాని సైతం భయభ్రాంతురాలైంది. భర్త వద్దకెళ్లి 'దుర్వాసం భవతి మి' అని ప్రాధేయపడింది. మీతో ప్రశాంతంగా కాపురం చేయడం నానాటికి కష్టమవుతోంది అని ఆ మాటకు అర్థం. తనకోపం క్షణికమే అయినా దానివల్ల పార్వతి సుఖంగా వుండలేకపోతోందని గ్రహించి తనలోని కోపాన్ని ఉద్రేకాన్నీ మరొకరిలో ప్రవేశపెట్టాలని నిశ్చయించుకున్నాడు శివుడు. 
 
ఈ సంఘటన జరిగిన రోజుల్లో శిలాపతి అనే సాధ్వీమణి వుండేది. ఆమె భర్త ఉగ్రస్రావుడు దుశ్శీలుడు, కుష్టురోగి. వ్యాధితో బాధపడుతూ కూడా వారకాంతల ఇళ్లకు తీసుకుని వెళ్లమని భార్యను వేధిస్తుండేవాడు. ఒకరోజు శిలాపతి భర్త కోరికపై నడవలేని అతడిని నెత్తి మీద బుట్టలో కూర్చోపెట్టుకుని ఓ వార కాంత ఇంటికి తీసుకుని వెళ్తుండగా అనుమాండవ్య మహాముని ఎదురై అతడిని చీదరించుకుని... రేపు సూర్యోదయ వేళ నువ్వు తల పగిలి మరణిస్తావు అని శపించాడు. అందుకు ప్రతిగా... రేపు అసలు సూర్యోదయమే వుండదు గాక అని శిలాపతి పలికింది. 
 
పతివ్రతా శిరోమణి మాటకు తిరుగులేకుండా మరునాడు సూర్యుడు ఉదయించలేదు. వెలుగు కోసం ప్రాణికోటి గగ్గోలు పెట్టింది. అప్పుడు త్రిమూర్తులు అత్రిమహర్షి భార్య అనసూయ దగ్గరకు వెళ్లి శిలాపతి శాపాన్ని ఉపసంహరించుకునేట్లు చేయమని అర్థించారు. అనసూయ కోరిక మేరకు శిలాపతి తన శాపాన్ని వెనుకకు తీసుకుంది. మరుక్షణం సూర్యుడు వేనవేల కిరణాలతో వెలిగాడు. 
 
త్రిమూర్తులు సంతోషించి అనసూయను ఏదైనా వరం కోరుకోమని అడిగారు. మీ ముగ్గురి అంశలతో నాకు బిడ్డలు కలగాలి అని ఆమె కోరుకుంది. సరేనన్నారు త్రిమూర్తులు. ఆ ప్రకారం బ్రహ్మ అంశతో చంద్రుడు, మహావిష్ణువు అంశతో దత్తాత్రేయుడు కలిగారు. పార్వతి భరించలేకుండా వున్న తన ఆగ్రహాన్ని శివుడు అనసూయలో ప్రవేశపెట్టాడు. ఆ అంశతో అనసూయకు కలిగినవాడే దుర్వాసుడు. కోపం నుంచి పుట్టాడు కనుక ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతుండేవారు. ఈ కథ బ్రహ్మానంద పురాణంలో వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

25-09-2019- బుధవారం నాటి దినఫలాలు.