భయం లేకపోవడం, సత్వ గుణం కలిగి వుండటం, జ్ఞానయోగ వ్యవస్థ, దానం, ఇంద్రియ నిగ్రహం, దైవారాధన, జ్ఞానసముపార్జన, తపస్సు, కపటం లేకపోవడం, అహింస, సత్యభాషణ, కోపం లేకపోవడం, త్యాగం, శాంతి, మొండితనం లేకపోవడం, జీవులందరిపై దయ, విషయాలలో వ్యసనం లేకపోవడం, మృదుస్వభావం అనే లక్షణాలు.
వీటితో పాటు వినయం, చిత్తచాపల్యం లేకపోవడం, తేజస్సు, ఓర్పు, ధైర్యం, శరీరానికి మనస్సుకు సంబంధించిన పరిశుద్ధి, ద్రోహచింతన లేకపోవడం, ధనికుడుననో, అందగాడిననో, విద్యావంతుడిననో, బలవంతుడిననో దురభిమానం లేకపోవడం, ఇవన్నీ దైవీ సంపదలో పుట్టినవారికి వుండే లక్షణాలు. అందువల్లనే వారి ప్రవృత్తి దివ్యంగా వుంటుంది. ఆదర్శంగా వుంటుంది.