తిరుమల కొండపై దళారులకు ఎక్కువ అవకాశాలను కల్పిస్తున్న విఐపి బ్రేక్ దర్శనాలు ఇకపై ఆన్‌లైన్ విధానం అమలు చేయాలని టీటీడీ భావిస్తోంది. ప్రోటోకాల్ దర్శనాలు మినహా మిగిలిన సిఫార్సుల దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా స్వీకరించి అర్హత కలిగిన వారికి మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించే విధంగా గా చర్యలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాల సమాచారం.
రోజుకు రెండు వేల టికెట్లకుపైగా జారీ చేస్తున్న వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను పరిమితంగా కుదించి ఆన్‌లైన్లో మంజూరు చేయాలని భావిస్తున్నారు. దరఖాస్తులు కూడా ఆన్‌లైన్‌లోనే స్వీకరించే సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్నారు. తద్వారా తిరుమల కొండపై ప్రైవేటు పీఆర్వోల ముసుగులో ఉన్న దళారీ వ్యవస్థను అడ్డుకట్ట వేయవచ్చని యోచిస్తున్నారు.
ఇటీవలికాలంలో టీటీడీ ప్రత్యేక అధికారిగా ఏవి ధర్మారెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం దళారీ వ్యవస్థను రూపుమాపే దిశగా అడుగులు వేశారు. ఇందులో భాగంగానే 65 మంది దళారీలను అరెస్టు చేశారు. సాధారణంగా వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు పొందాలంటే సంబంధిత ప్రముఖులు ముందురోజుగా సిఫార్సు లేఖలు తిరుమల జేఈవో కార్యాలయంలో సమర్పించాల్సి రావడం, వాటికి ఐడి కార్డులు, వేలిముద్రలు పొందుపరచాల్సి రావడం తదితర వ్యవహారాలు పూర్తి చేయాల్సి ఉంటుంది.
అయితే ఇవన్నీ నేరుగా ప్రముఖులు వీఐపీలు చేయడం లేదు. తమ ప్రతినిధుల ద్వారా చేయించడం జరుగుతోంది ఈ క్రమంలోనే తిరుమలలో ప్రైవేటు పీఆర్వోల వ్యవస్థ పెరిగిపోయింది. పీఆర్వోల ముసుగులో దళారులు యధేచ్చగా తమ అక్రమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఉన్న మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు నిత్యం సిఫార్సు లేఖలను తిరుమల తిరుమలకు పంపిస్తుంటారు. తమ వారికి కి దర్శనాలు చేయించాలి అంటూ సిఫార్సులు చేస్తుంటారు.
ఇదే అదునుగా ప్రైవేటు పీఆర్వోలు తమ చేతివాటం చూపిస్తూ ప్రముఖుల సిఫార్సు లేఖలు కలర్ జిరాక్స్ చేసుకొని తిరుమలలోని జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీటీడీ ఛైర్మన్ కార్యాలయాల్లో ఉన్న తితిదే సిబ్బందితో కుమ్ముక్కై విచ్చలవిడిగా బ్లాక్ మార్కెట్లో స్వామివారి దర్శనంటికెట్ల విక్రయంచుకుంటున్నారు. తిరుమల జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యాలయం, టీటీడీ ఛైర్మన్ కార్యాలయంలో ఇటీవలకాలంలో ఎక్కువగా భక్తులతో కుమ్ముక్కై దళారుల ద్వారా విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు ప్యాకేజీల ప్రకారం విక్రయించడం వెలుగు చూసింది. కొంతమంది టీటీడీ సిబ్బందిని ఈ కారణంగానే బదిలీ చేశారు.
మరోవైపు తిరుమలలో పనిచేసే కొంత మంది మీడియా ప్రతినిధులు సైతం తితిదే మంజూరు చేస్తున్న బ్రేక్ దర్శనం టిక్కెట్లు దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ పరిస్థితులు అన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఇకపై శ్రీవారి దర్శనానికి స్వీకరించే సిఫార్సు లేఖలను ఆన్‌లైన్ ద్వారానే స్వీకరించేలా పారదర్శకమైన కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సంసిద్ధత అవుతున్నారు. మంజూరు చేసిన వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ల వివరాలను కూడా ఆన్‌లైన్‌లో ఉంచే విధంగా విమర్శలకు తావు లేకుండావుండే విధానాన్ని అమలు చేయడానికి ప్రణాళిక సిద్ధమైంది. త్వరలోనే తితిదే పాలక మండలి ఏర్పడిన తర్వాత సమావేశంలో చర్చించి ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.