వైకుంఠ ఏకాదశి, స్వర్గపురి ఏకాదశి అంటారు. ఈ రోజున ముప్పై మూడుకోట్ల దేవతలతో కలిసి శ్రీమహావిష్ణువు భూలోకి వస్తారని ప్రతీతి. ఏకాదశి పేరు చెప్పగానే ఉపవాసం అందరికీ గుర్తుకు వస్తుంది. ప్రతి ఏకాదశికీ ఉపవాసం కుదరకపోతే తొలి ఏకాదశి, నిర్జల ఏకాదశి, వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసాన్ని ఆచరించాలని పండితులు సూచిస్తున్నారు.
వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ఏడాదిలోని అన్ని ఏకాదశులలోనూ ఉపవాసం ఆచరించినట్టు ఫలితం దక్కుతుందని విశ్వాసం. విష్ణుమూర్తి ముక్కోటి దేవతలతో కలిసి ఈ రోజున దర్శనమిస్తారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అనీ, వైకుంఠ ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. అందుకే వైకుంఠ ఏకాదశినాడు ఉత్తర ద్వారం నుంచి భక్తులు విష్ణుమూర్తిని దర్శించుకుని తరిస్తారు.
ఉపవాసం ఎలా చేయాలంటే?
ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం చేయాలనుకునే భక్తులు ముందు రోజు అంటే దశమి రాత్రి నుంచే ఉపవాసాన్ని ఆరంభించాలి. ఏకాదశి రోజున తులసి తీర్థం మాత్రమే సేవించి, రాత్రి జాగరణ ఉండాలి. మర్నాడు ద్వాదశి రోజు ఉదయం ఆహారాన్ని స్వీకరించడంతో ఉపవాస దీక్షను ముగిస్తారు. ఉపవాస దీక్ష వెనుక పరమార్థం దాగి ఉంది.
దేహాన్ని శాసించే ఆకలి, నిద్రల మీద అదుపు సాధించవాడి స్థైర్యానికి తిరుగుండదని, భగవన్నామస్మరణతో ఏకాదశినాటి రాత్రిని గడపమని సూచిస్తారు. అదే ఏకాదశి ఉపవాసానికి వెనుకనున్న అర్థం. ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు.
అలాంటి వారు పాలు, పండ్లు లాంటి తేలికపాటి ఆహారాన్ని తీసుకోవచ్చు. మురాసురుడు అనే రాక్షసుడు ఈ రోజున బియ్యంలో ఉంటాడు కాబట్టి దీనితో చేసిన పదార్థాలను భుజించకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఈ వైకుంఠ ఏకాదశి నాడు "వైకుంఠ ఏకాదశి వ్రతం" ఆచరించిన వారికి శుభ ఫలితాలుంటాయి. పర్వత సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి.
సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోనికి ప్రవేశిస్తారని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి.
ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి. ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు తిని ఉండవచ్చు. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇంకా ఏకాదశి వ్రతము చేసే వారికి మరో జన్మంటూ ఉండదని అంటారు.