ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ అధినేత దీపిందర్ గోయల్ ఫుడ్ డెలివరీ బాయ్‌గా అవతారమెత్తారు. అయితే, ఓ మాల్‌లో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. జొమాటో కిట్‌తో మాల్‌లోకి వెళ్లేందుకు సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. దీంతో ఆయన మెట్లు ఎక్కి ఆర్డర్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
విధుల్లో ఉండగా తన డెలివరీ ఏజెంట్లకు ఎదురవుతున్న సమస్యలు, పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు ఆయన స్వయంగా డెలివరీ బాయ్ అవతారమెత్తాడు. ఆ సమయంలో ఓ మాల్‌లో ఆర్డర్ కలెక్ట్ చేసుకునేందుకు వెళ్ళిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. దాని గురించి చెప్తూ ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.
రెండో ఆర్డర్‌ను తీసుకునేందుకు మాల్‌లోకి వెళ్లేందుకు యత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారని దీపిందర్ గోయల్ వెల్లడించారు. తనను మెట్ల మార్గంలో వెళ్లమని సూచించారని తెలిపారు. డెలివరీ బాయ్స్ సంక్షేమం దృష్ట్యా మాల్స్‌తో కలిసి జొమాటో మరింత దగ్గరగా పని చేయాల్సి ఉందనే విషయం ఈ ఘటన ద్వారా అర్థమైందని వ్యాఖ్యానించారు.