ఫోను ప్రాణం తీసింది. ఫోనులో మాట్లాడుతూ లిఫ్టులో ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ డెలివరీ బాయ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని మయూరీ నగర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
మయూరీ నగర్‌లో నివాసముంటున్న జేమ్స్(38) అనే వ్యక్తికి భార్య ఇద్దరు, పిల్లలు ఉన్నారు. ఈయన స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ కొరియర్ కంపెనీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం అశోక్ నగరులోని నివాస్ టవర్స్ అనే అపార్టుమెంట్ నాలుగో అంతస్తులో డెలివరీ చేసిన పార్శిల్‌ను వెనక్కి తీసుకునేందుకు వచ్చాడు.
పార్శిల్ తీసుకుని తిరిగి కిందికి వెళ్లేందుకు నాలుగో అంతస్తులోని లిఫ్ట్ గ్రిల్ డోర్ తెరిచారు. అప్పటికే ఫోనులో మాట్లాడుతూ అందులో లీనమైపోయాడు. ఫోన్ మాట్లాడుతుండటంతో లిఫ్ట్ పైకి రాని విషయాన్ని గమనించకుండా లిఫ్టు వచ్చిందన్న భావనతో కాలు లోపలికి పెట్టడంతో ఒక్కసారిగా మొదటి అంతస్తులో ఉన్న లిఫ్ట్ పై భాగంలో పడిపోయారు.
ఈ విషయం తెలియని మరో అపార్టుమెంట్ వారు లిఫ్ట్ ఆన్ చేయడంతో లిఫ్టు పైకి వచ్చింది. ఆ లిఫ్టు పైభాగంలో ఉన్న స్లాబ్ తగలడంతో జైమ్స్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మూడో అంతస్తులో ఆగిపోవడంతో మెకానిక్ వచ్చి మరమ్మతులు చేస్తుండగా పై భాగంలో మనిషి చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్య జరిమా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ శుక్రవారం తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.