ప్రపంచంలోని రెండో పెద్ద రవాణా వ్యవస్థగా భారతీయ రైల్వే గుర్తింపు పొందింది. అలాంటి రైళ్ళలో ప్రయాణికుల బోగీల్లో మాత్రం దుర్వాసన వస్తుంటుంది. దీనికితోడు ఎలుకలు రాజ్యమేలుతుంటాయి. ఈ ఎలుకల బెడదకు పలు సందర్భాల్లో రైళ్ళను కొన్నిగంటల పాటు నిలిపివేసిన సందర్భాలు లేకపోలేదు.
అంతేకాకుండా, రైళ్లు పట్టాలపై సాఫీగా పరుగులు పెట్టాలంటే ఎన్నో సమస్యలను అధిగమించాలి. వీటిలో ప్రధానంగా సిగ్నలింగ్ వ్యవస్థ మెరుగ్గా ఉండాలి. ఈ సిగ్నల్ కోసం వేల వైర్లు అనుసంధానమై ఉంటాయి. వీటిలో ఏ ఒక్కటి తెగిపోయినా సిగ్నలింగ్ వ్యవస్థలో అంతరాయం ఏర్పడుతుంది. సిగ్నలింగ్ వ్యవస్థలోని వైర్లను తరచూ ఎలుకలు కొరికేస్తుంటాయి.
ఈ నేపథ్యంలో ఎలుకలను అంతమొందించేందుకు రైల్వేశాఖ పలు చర్యలు చేపట్టాల్సి వస్తుంటుంది. పశ్చిమ రైల్వే గడచిన మూడేళ్లలో ఎలుకలను చంపేందుకు కోటిన్నర రూపాయలను ఖర్చుచేసింది. ఇంత ఖర్చు చేసినప్పటికీ రైల్వేశాఖ ఇన్నాళ్లలో కేవలం 5,457 ఎలుకలను మాత్రం చంపగలిగింది. ఈ లెక్కన ఎలుకల నియంత్రణకు రోజుకు రూ.14 వేలు ఖర్చు చేస్తూ, కేవలం 5 ఎలుకలను చంపగలుగుతోందని తేలింది. ఆర్టీఐ నుంచి వచ్చిన ప్రశ్నకు పశ్చిమరైల్వే ఈ విధమైన సమాధానమిచ్చింది.