తమిళనాడు రాష్ట్రంలోని తిరుప్పూరు జిల్లాలో తండ్రీ కుమారుల మధ్య జరిగిన గొడవలను ఆపేందుకు వెళ్లిన ఎస్ఎస్ఐను కొడవలితో నరికి చంపేసిన కేసులో ప్రధాన నిందితుడును పోలీసులు కాల్చిచంపేశారు. గురువారం తెల్లవారుజామున పోలీస్ కాల్పుల్లో ప్రధాన నిందితుడు మణికంఠన్ ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసుల కథనం మేరకు.. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని దాచిన ప్రదేశానికి మణికంఠన్‌ను తీసుకెళుతున్నపుడు ఒక ఎస్ఐపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపారు. తిరుప్పూరు జిల్లా గుడిమంగళం గ్రామంలో 57 యేళ్ల స్పెషల్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎం.షణ్ముగవేల్‌ను మణికంఠన్ కొడలితో నరికి చంపిన విషయం తెల్సిందే.
ఎస్ఎస్ఐ హత్య కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం మణికంఠన్‌ను గుడిమంగళం సమీపంలోని చిక్కనూర్ వద్ద ఉన్న ఉప్పారు డ్యామ్ సమీపంలోని వాగు వద్దకు తీసుకెళ్లింది. నిందితుడు అక్కడ మణికంఠన్ హత్యకు ఉపయోగించిన కొడవలిని దాచగా, ఈ క్రమంలో ఎస్ఐ శరవణ కుమార్‌పై కొడవలితో దాడి చేసి తప్పించుకోవడానికి నిందితుడు ప్రయత్నించాడు.
దీంతో తమను తాము రక్షించుకోవడానికి, మణికంఠన్ తప్పించుకోకుండా అడ్డుకునేందుకు ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలోని బృందం కాల్పులు జరిపించి. ఈ కాల్పుల్లో మణికంఠన్ అక్కడికక్కడే మరణించాడు. అతడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తిరుపూర్ ప్రభుత్వ వైద్య కాలేజీ ఆస్పత్రికి తరలించారు.