అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) నివేదిక ప్రాథమిక ఫలితాల ఆధారంగా ఉందని, తుది నివేదికను బహిర్గతం చేసే వరకు ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు శనివారం అన్నారు.
ఈ విషయమై ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన పైలట్లు, సిబ్బంది మన దగ్గర ఉన్నారని నేను నమ్ముతున్నాను. దేశంలోని పైలట్లు, సిబ్బంది చేస్తున్న అన్ని ప్రయత్నాలను నేను అభినందించాలి, వారు పౌర విమానయానానికి వెన్నెముక.. అని కేంద్ర మంత్రి అన్నారు.
"వారు పౌర విమానయానానికి ప్రాథమిక వనరు. పైలట్ల సంక్షేమం, శ్రేయస్సు కోసం కూడా మేము శ్రద్ధ వహిస్తాము. ప్రాథమిక నివేదిక వచ్చింది కానీ నిర్దిష్టమైన విషయం వచ్చే వరకు మనం వేచి ఉండాలి. కాబట్టి ఈ దశలో మనం ఎటువంటి నిర్ధారణలకు రాకుండా తుది నివేదిక కోసం వేచి చూద్దాం.. అని మంత్రి రామ్ మోహన్ నాయుడు అన్నారు.
మరోవైపు ప్రాథమిక నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్‌లు సెకన్ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు మరో పైలట్‌ను ప్రశ్నించాడని, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చాడని నివేదికలో పేర్కొంది.
కాక్‌పిట్‌లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని తెలిపింది. తర్వాత పైలట్లు మేడేకాల్ ఇచ్చారని, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC) స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని వెల్లడించింది. ఈలోపే విమానం కూలిపోయిందని పేర్కొంది. ఈ ప్రమాదం వెనుక ఎలాంటి కుట్ర కోణం లేదని తెలిపింది. పక్షి ఢీకొన్న ఆనవాళ్లు కూడా కన్పించలేదని నివేదికలో తెలిపింది