తెలంగాణ ప్రాంతానికి చెందిన సినీ, జానపద గాయని మంగ్లీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టీడీపీ నేతలు సాగిలపడుతున్నారు. ఆమెకు సేవ చేసేందుకు పోటీపడుతున్నారు. ముఖ్యంగా, దైవదర్శనాలకు ఆమెకు వీఐపీ హోదాలో తమ వెంట ఆలయాలకు తీసుకెళుతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడ పేరును తన నోట ఉచ్ఛరించడం ఏమాత్రం ఇష్టం లేదని తెగేసి చెప్పిన వైకాపా కరుడుగట్టిన మద్దతుదారుగా ఉన్న మంగ్లీకి ఇపుడు టీడీపీ నేతలు ఇలా నడుచుకోవడంపై ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో ఆమె వైకాపా తరపున ప్రచారం చేశారు. ఫ్యాను గుర్తుకు ఓటు వేస్తే చల్లగా ఉంటారని ప్రచారం చేసింది. టీడీపీ తరపున పాటల పాడాల్సిందిగా టీడీపీ నేతలు కోరినా ఆమె ససేమిరా అన్నారు. పైగా, నా నోట చంద్రబాబు ఉచ్ఛరించడానికి ఇష్టపడనని తెగేసి చెప్పారు.
ఇపుడు సీన్ రివర్స్ అయింది. టీడీపీ నేతలు ఆమెకు బ్రహ్మరథం పడుతున్నారు. చోటామోటా నేతలే కాదు కేంద్ర రాష్ట్ర మంత్రులే ఇలాంటి చర్యలకు పాల్పడుతుండటంతో కిందిస్థాయి కార్యకర్తలు రగిలిపోతున్నారు. కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు అరసవిల్లి ఆలయంలోకి మంగ్లీని తన వెంటబెట్టుకుని తీసుకెళ్లారు. రథసప్తమి ఉత్సవాల సందర్భంగా అరసవిల్లి ఆలయం వద్ద మంగ్లీ బృందం పాటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా కలిసి రామ్మోహన్ నాయుడు ఆలయానికి వచ్చారు. ఆ సమయంలో మంగ్లీని కూడా ఆలయంలోకి తన వెంట తీసుకెళ్లారు. దీన్ని చూసిన టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డికి మద్దతిచ్చిన మంగ్లీని వెంట తీసుకెళ్లి ప్రత్యేక దర్శనం ఎలా చేయిస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వారు ప్రశ్నిస్తున్నారు. వైకాపా హయాంలో టీడీపీ నేతలు, కార్యక్తలను వేధింపులకు గురిచేసిన అనేక మంది వైకాపా నేతలతో పాటు.. అప్పటి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేస్ బాలాజీరావును రామ్మోహన్ నాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకోవడాన్ని సైతం టీడీపీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. వీటిపై మాత్రం మంత్రి రామ్మోహన్ నాయుడు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.