రాజకీయ పార్టీల నేతలకు సంబంధించి హోర్డింగ్స్, ఫ్లెక్సీలు రోడ్డుకు ఇరువైపులా లేదా రోడ్డు మధ్యభాగంలో ఏర్పాటు చేయొద్దని మద్రాసు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అయినప్పటికీ రాజకీయ పార్టీల తీరు మారడం లేదు. ఫలితంగా మరో విషాదకర సంఘటన జరిగింది. ఇప్పటికే చెన్నై నగర శివారు ప్రాంతమైన పళ్లికరణైలో జరిగిన ఓ ప్రమాదంలో శుభశ్రీ అనే టెక్కీ మృత్యువాతపడింది. ఈ ఘటన మరువకముందే కోయంబత్తూరులో మరో ఘటన జరిగింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, కోవై పట్టణానికి చెందిన అనురాధ(30) అనే మహిళ ఓ హోటల్‌లో అకౌంట్స్ సెక్షన్‌లో పని చేస్తూ కుటుంబానికి అండగా ఉంది. ఈమె రోజూలానే స్కూటీపై ఉద్యోగానికి వెళుతుండగా కోయంబత్తూరులోని అవినాషి రోడ్‌లో రోడ్డు మధ్యలో అధికార అన్నాడీఎంకే నేతలు కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. ఈ ఫ్లెక్సీ ఉన్నట్టుండి కింద పడింది.
ఆ సమయంలో ఆ ఫ్లెక్సీని తప్పించే ప్రయత్నంలో అనురాధ స్కూటర్ అదుపు తప్పి కింద పడింది. సరిగ్గా అపుడే వెనుక నుంచి వేగంగా వస్తున్న ఓ లారీ ఆ స్కూటీపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అనురాధ కాళ్లు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఓ కాలి నరం పూర్తిగా తెగినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనతో అనురాధ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా, చెన్నైలో జరిగిన శుభశ్రీ ఘటనతో మద్రాసు హైకోర్టు చీవాట్లు పెట్టినప్పటికీ రాజకీయ పార్టీల కార్యకర్తలు, నేతల వైఖరిలో ఏ మాత్రం మార్పు రాలేదు. పార్టీల జెండాలు, కటౌట్లతో రోడ్లను నింపేస్తున్నారు. ఫలితంగా ఇలాంటి విషాదకర ఘటనలు జరుగుతున్నాయి.