రాజ్‌కోట్ వేదికగా జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టును భారత కెప్టెన్ రోహిత్ శర్మ చితక్కొట్టాడు. ఫలితంగా ప్రత్యర్థి జట్టు విసిరిన 154 పరుగుల విజయలక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించింది.
గురువారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఆ తర్వాత 154 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ 43 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేయడంతోపాటు.. శ్రేయాస్ అయ్యర్ 24, శిఖర్ ధవాన్ 31 పరుగులు చేయడంతో మరో 26 బంతులు మిగిలివుండగానే మ్యాచ్ ఫినిష్ అయింది. ఫలితంగా 3 మ్యాచ్‌లో సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమఉజ్జీలుగా నిలిచాయి. చివరిదైన మూడో టి20 మ్యాచ్ నవంబరు 10న నాగ్‌పూర్‌లో జరగనుంది