దేశంతో పాటు.. ప్రపంచాన్ని చుట్టుముట్టిన కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశప్రజలందరి ఐక్యతకు సూచికగా ఆదివారం రాత్రి దియా జలోవో(దీపం వెలిగించే కార్యక్రమం) జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుతో దేశ ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
దేశం మొత్తం ఒకేసారి గృహాల్లో దీపాలు ఆర్పివేయడం వల్ల పవర్ గ్రిడ్లు కుప్పకూలిపోయే ప్రమాదం ఉందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వీటిపై ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు వివరణ ఇచ్చారు. ఆదివారం రాత్రి ఒకేసారి లైట్లు ఆర్పేయడం వల్ల పవర్‌గ్రిడ్‌పై ఎలాంటి ప్రభావం పడదని వివరణ ఇచ్చారు.
అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ గ్రిడ్‌కు ఎలాంటి సమస్య రాకుండా అప్రమత్తంగా ఉన్నామన్నారు. లైట్లు ఆర్పేస్తే గ్రిడ్ కుప్పకూలుతుందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదన్నారు. తెలంగాణ గ్రిడ్ సురక్షితంగా ఉందన్నారు. కరోనా కట్టడికి ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపును విజయవంతం చేయండని సూచించారు. కరోనాపై మనం విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
మరోవైపు, ఆయా రాష్ట్రాల విద్యుత్ సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. దీపం వెలిగించే కార్యక్రమం వల్ల ఎలాంటి విద్యుత్ అవాంతరాలు తలెత్తకుండా చూడాలని విద్యుత్ సంస్థలకు సూచించింది. విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ కేంద్రాల దగ్గర విధుల్లో ఉండాలని, అత్యవసర పరిస్థితి తలెత్తినా దాన్ని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండాలని కోరింది.
మరోవైపు, ప్రధాని మోడీ ఇచ్చి లైట్ దియాపై వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ, 'ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మనసులో ఏముందో తాను చెబుతారు. నా మనసులో ఏముందో నేను చెబుతాను. ఇతరుల విషయాల్లో నేను జోక్యం చేసుకోను. ప్రధాని మంచి విషయం చెప్పారని అనుకుంటే మీరు అనుసరించండి. ఇది వ్యక్తిగత నిర్ణయం' అని చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా, 'ఆదివారం రాత్రి 9 గంటలకు నాకు నిద్రొస్తే నేను నిద్రపోతాను. మోడీ మీకు చెప్పారు.. మీరు చెయ్యండి. నన్నెందుకు దాని గురించి అడుగుతారు. నేనేం చేయగలనో నేను చెబుతాను. మోడీ ఏం చేయగలరో ఆయన చెబుతారు. కరోనా వైరస్‌ను అడ్డుకోమంటారా? లేక రాజకీయాలు చేయమంటారా? దయచేసి రాజకీయ పోరుకు ఆజ్యం పోయొద్దు' అని ఆమె వ్యాఖ్యానించారు.