ఆ తర్వాతే లాక్‌డౌన్‌పై నిర్ణయం... సీఎంలతో ప్రధాని మోడి ఏమన్నారు?

గురువారం, 2 ఏప్రియల్ 2020 (20:17 IST)
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా ప్రస్తుతం దేశంలో 21 రోజుల లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఇది ఈ నెల 14వ తేదీతో ముగుస్తుంది. ఆ తర్వాత లాక్‌డౌన్ పొడగిస్తారని కొందరు, పొడగించరని మరికొందరు అంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడి గురువారం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఆయన కొన్ని సంకేతాలు ఇచ్చారు. వీటి ప్రకారం ఈ నెల 10 తేదీ తర్వాత లాక్‌డౌన్ పొడగింపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు, శుక్రవారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడనున్నారు. ఇందులో ఏం మాట్లాడతారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
 
మరోవైపు, సీఎంలతో జరిగిన సమావేశంలో కరోనా వైరస్‌ను పూర్తిగా తరిమేసేందుకు వ్యూహాన్ని ఆలోచించి, దాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ముఖ్యంగా, పెద్ద పెద్ద సభలు, సమావేశాలపై నిషేధం ఉంటుందని, ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ, తగు జాగ్రత్తలు తీసుకుంటూ తమ దైనందిన కార్యకలాపాలు నిర్వహించుకునే వీలును కల్పించేలా నిర్ణయాలు తీసుకోవాలని ప్రధాని మోడీ తన మనసులోని మాటను సీఎంలతో పంచుకున్నట్టు తెలుస్తోంది.
 
ఇదిలావుంటే, పీఎం కార్యాలయం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఇందులో వైద్య ఉత్పత్తుల సరఫరాకు ఎలాంటి అడ్డంకులూ లేవని స్పష్టం చేసింది. వైద్య పరికరాలు, ఔషధాలు తయారు చేసే సంస్థలకు అవసరమైన ముడిసరుకు సరఫరా సక్రమంగా సాగుతోందని పేర్కొంది. అనుమానిత కేసులను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కీలకంగా వ్యవహరించాయని పేర్కొంది.
 
దేశంలో లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత పరిస్థితులను నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి వ్యూహంతో ముందుకెళ్లాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రజలు తిరిగి సాఫీగా జీవనం గడిపేందుకు తగిన ప్రణాళిక రచించాలన్నారు. ఈ విషయంలో సలహాలు ఇవ్వాలని రాష్ట్రాలను కోరారు. వీలైనంత తక్కువ ప్రాణనష్టంతో ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
 
లాక్‌డౌన్ తర్వాత పరిస్థితులు సాధారణంగా ఉండబోవన్న ప్రధాని.. తగిన భద్రతా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అలాగే, లాక్‌డౌన్‌ను రాష్ట్రాలు పక్కాగా అమలు చేయాలని, సోషల్ డిస్టెన్స్‌‌కు కట్టుబడి ఉండాలని కోరారు. ‘వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు యుద్ధ ప్రాతిపదికన పని చేయాలి. వైరస్ హాట్ స్పాట్లు గుర్తించి, వాటిని నిర్బంధం చేయాలి. రాబోయే వారాల్లో పరీక్షల నిర్వహణ, వైరస్ సోకిన వారిని గుర్తించడం, ఐసోలేషన్, క్వారంటైన్ నిర్వహణపైనే దృష్టి పెట్టాలి’ అని ప్రధాని మోడీ ముఖ్యమంత్రులకు సూచించినట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అడ్వాన్స్ రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన రైల్వే శాఖ... రైలు రాకపోకలపై...