Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

Advertiesment
vvpat

వరుణ్

, శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (11:58 IST)
ఈవీఎం - వీవీప్యాట్‌లలో పోలైన ఓట్ల క్రాస్ వెరిఫికేషన్ సాధ్యం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈవీఎంలలో పోలైన ఓట్లను, వీవీప్యాట్ స్లిప్పులతో వందశాతం వెరిఫికేషన్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించడం సాధ్యంకాదని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఒకే అభిప్రాయంతో రెండు తీర్పులు వెలువరించింది.
 
ఈ పిటిషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు విస్తృతంగా విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రొటోకాల్‌లు, సాంకేతిక అంశాలపై ఎన్నికల సంఘానికి పలు ప్రశ్నలు సంధించిన ధర్మాసనం.. ఈసీ నుంచి సమగ్ర వివరణ తీసుకుంది. అనంతరం తీర్పును రిజర్వ్‌ చేసిన న్యాయస్థానం.. పేపర్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ డిమాండ్లు సహా అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.
 
ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి పలు ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎంలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ యూనిట్‌ను సీల్ చేయాలని తెలిపింది. దాన్ని కనీసం 45 రోజుల పాటు భద్రపర్చాలని సూచించింది. ఫలితాల ప్రకటన తర్వాత అభ్యర్థులు ఏడు రోజుల్లోపు తమ అభ్యంతరాలను తెలియజేయాలని తెలిపింది. అప్పుడు ఇంజినీర్ల బృందం మైక్రో కంట్రోలర్ ఈవీఎంలో బర్న్ చేసిన మెమొరీని తనిఖీ చేయాలని తెలిపింది. ఈ వెరిఫికేషన్‌కు అయ్యే ఖర్చులను అభ్యంతరాలు లేవనెత్తిన అభ్యర్థులే భరించాలని వెల్లడించింది. ఒకవేళ ఈవీఎం ట్యాంపర్ అయినట్లు తేలితే... ఖర్చులు తిరిగి ఇవ్వాలని సూచించింది.
 
ఈ సందర్భంగా జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యవస్థను గుడ్డిగా అపనమ్మకంతో చూడటం.. అనవసర అనుమానాలకు దారి తీస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక, కౌంటింగ్‌ సమయంలో పేపర్‌ స్లిప్‌లను లెక్కించేందుకు ఎలక్ట్రానిక్‌ మెషిన్‌ను ఉపయోగించాలన్న పిటిషనర్ల సూచనను పరిశీలించాలని జస్టిస్‌ ఖన్నా ఈసీకి తెలిపారు. అంతేగాక, ప్రతి పార్టీ పక్కన గుర్తుతో పాటు బార్‌కోడ్‌ కూడా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి