Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

173 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేసిన అరవింద్ కేజ్రీవాల్.... ఎందుకో తెలుసా?

kejriwal

వరుణ్

, గురువారం, 25 ఏప్రియల్ 2024 (10:33 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ కేసులో సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు ఏకంగా 173 ఫోన్లను ధ్వంసం చేశారని ఢిల్లీ కోర్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమర్పించిన కౌంటర్ అఫిడవిట్‌లో పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ముడిపడిన మనీల్యాండరింగ్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ సీఎం అరవింద్ కేజ్రివాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈడీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. 
 
కేజీవాల్ పెద్ద ఎత్తున సాక్ష్యాధారాల ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. స్కామ్ జరిగిన సమయంలో ఏకంగా 173 మొబైల్ ఫోన్లు ధ్వంసం చేశారని, అక్రమాలు బహిర్గతం కావడంతో ఆధారాలను ధ్వంసం చేశారని దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఏకంగా తొమ్మిది సార్లు సమన్లు పంపినప్పటికీ ఆయన విచారణకు రాలేదని ప్రస్తావించింది. సమన్లను పదేపదే దాటవేశారని, ఈ సమయంలో అరెస్టు నుంచి రక్షణను ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు కూడా తేల్చిచెప్పడంతో ఆయనను అరెస్టు చేశామని ఈడీ పేర్కొంది.
 
ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ నుంచి కేజీవాల్‌కు ఉపశమనం లభించని సమయంలో మాత్రమే అతడి ఇంట్లో సోదాలు నిర్వహించామని, అనంతరం అరెస్టు చేశామని అఫిడవిట్‌లో ఈడీ వివరించింది. లోకసభ ఎన్నికల సమయంలో అరెస్ట్ చేశారనే ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ... నిందితుడి స్థాయితో తమకు సంబంధం లేదని, సాక్ష్యాలను ఆధారంగా చర్యలు తీసుకున్నామని తెలిపింది. నేరారోపణలు ఉన్న రాజకీయ నాయకులకు అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తే ఎన్నికల ప్రక్రియ సమగ్రతను దెబ్బతీసినట్టేనని ఈడీ వ్యాఖ్యానించింది.
 
ఆధారాలను బట్టి ఒక వ్యక్తిని అరెస్టు చేయడం స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల భావనను ఉల్లంఘించినట్టు కాదని, కేజీవాల్ వాదనతో ఏకీభవిస్తే నేరస్థులైన రాజకీయ నాయకులకు అరెస్టుల నుంచి మినహాయింపు లభిస్తుందని ఈడీ అభిప్రాయపడింది. కాగా ఈడీ అఫిడవిట్లోని అంశాలను ఆప్ తిరస్కరించింది. దర్యాప్తు సంస్థ అన్నీ అబద్ధాలే చెబుతోందని మండిపడింది. అరవింద్ కేజీవాల్‌కు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంది. బీజేపీ రాజకీయ విభాగంగా ఈడీ మారిపోయిందని, అబద్ధాలు చెప్పే యంత్రంగా ఈడీ తయారయ్యిందని ఆప్ తీవ్ర విమర్శలు గుప్పించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎమ్మెల్సీ ఎన్నికలు : కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న