రాజకీయాల్లోకి రానంటేరానని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మరోమారు స్పష్టంచేశారు. కానీ, తాను రాజకీయాల్లోకి రావాలంటూ కొందరు ఆందోళనలు చేస్తున్నారని, అలాంటి సంఘటనలు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయని చెప్పారు. ఇదే అంశంపై ఆయన ఓ ప్రకటన చేశారు.
'కొంతమంది నా అభిమానులు, రజనీ మక్కల్ మండ్రం నుంచి తొలగించబడిన స్థానిక నేతలు నేను తిరిగి రాజకీయాల్లోకి రావాలని చెన్నైలో నిరసనలు తెలుపుతూ నా నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. నా నిర్ణయాన్ని నేను తీసేసుకున్నాను. దాన్ని అందరికీ చెప్పాను. ఇటువంటి నిరసనలకు దూరంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఈ ఘటనలు నాకు బాధను కలిగిస్తున్నాయి' అని ఆయన అన్నారు.
తాను రాజకీయాల్లోకి రావడం లేదని, పాలిటిక్స్‌లోకి ప్రవేశించకుండానే సేవ చేస్తానని దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్, గత నెల చివరి వారంలో స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత, పలు ప్రాంతాల్లో ఆయన అభిమానులు నిరసనలకు దిగుతున్న నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు. ఈ విషయంలో తాను ఓ నిర్ణయం తీసేసుకున్నానని ఆయన తెలిపారు. అందరూ దాన్ని గౌరవించాలని సూచించారు.