Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వణికిస్తున్న బర్డ్‌ఫ్లూ : 4 లక్షల కోళ్ళు మృతి.. మాంసం తినొద్దంటూ హెచ్చరికలు

వణికిస్తున్న బర్డ్‌ఫ్లూ : 4 లక్షల కోళ్ళు మృతి.. మాంసం తినొద్దంటూ హెచ్చరికలు
, బుధవారం, 6 జనవరి 2021 (10:35 IST)
దేశాన్ని మరో వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ మనుషుల్లో పెద్దగా ప్రభావం చూపక పోయినప్పటికీ.. కోళ్ళను చంపేస్తోంది. గత పది రోజుల్లో ఏకంగా నాలుగు లక్షల కోళ్లు చనిపోయాయి. అత్యంత ప్రమాదకరమైన బర్డ్‌ఫ్లూ వైరస్‌ (హెచ్‌5ఎన్‌8) దేశవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్నది. కాశ్మీర్‌ మొదలు కేరళ వరకు వందల సంఖ్యలో వలస పక్షులు ఈ వైరస్‌ బారిన పడి మరణిస్తుండటంతో కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీచేసింది. 
 
హర్యానా, జమ్మూకాశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ వైరస్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. హర్యానాలో పంచకుల జిల్లాలోని కోళ్ల ఫారాల్లో గత 10 రోజుల్లోనే ఏకంగా 4 లక్షల కోళ్లు మృతిచెందాయి. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూతో వందలసంఖ్యలో కాకులు మరణించాయి. 
 
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గత నెల 29న దలై కాలేజీ క్యాంపస్‌లో బర్డ్‌ఫ్లూతో ఒకేరోజు 50 కాకులు మరణించాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ వైరస్‌తో 155 కాకులు చనిపోయాయని.. ఇతర పక్షల్లో వైరస్‌ను గుర్తించలేదని మధ్యప్రదేశ్‌ వెటర్నరీ విభాగం డిఫ్యూటీ డైరెక్టర్‌ ప్రమోద్‌ శర్మ తెలిపారు. రాజస్థాన్‌లోని కోటా, బారన్‌ ప్రాంతాల్లో వలస పక్షుల్లోనూ బర్డ్‌ఫ్లూను గుర్తించారు. 
 
ఇకపోతే, కేరళలో బర్డ్‌ఫ్లూతో 1,700 బాతులు మరణించటంతో ఆలప్పుళ, కొట్టాయం ప్రాంతాల్లో పెంపుడు కోళ్లు, బాతులన్నింటినీ చంపేస్తున్నారు. ముఖ్యంగా వైరస్‌ వెలుగుచూసిన ప్రాంతానికి సమీపంలో ఉన్న నెడుముడి, తకఝై, పల్లిప్పాడ్‌, కరువట్ట గ్రామాల్లో పక్షులన్నింటినీ చంపుతున్నారు. వైరస్‌ వ్యాపించిన ప్రాంతంలో మొత్తం 40 వేల పెంపుడు కోళ్లు, బాతులను చంపాలని నిర్ణయించినట్టు తెలిపారు. 
 
అయితే, కేరళ సరిహద్దులకు సమీపంలో ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు బర్డ్‌ఫ్లూ భయంతో వణుకుతున్నాయి. కోళ్ల ఫారాలు, పక్షులు పెంపుడు కేంద్రాల్లోకి వైరస్‌ ప్రవేశించకుండా పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్టు తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి జే రాధాకృష్ణన్‌ తెలిపారు. 
 
కేరళ, తమిళనాడు రాష్ర్టాల సరిహద్దుల్లోని జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కే సుధాకర్‌ మంగళవారం ఆదేశించారు. మధ్యప్రదేశ్‌తో సరిహద్దు ఉన్న మహారాష్ట్ర కూడా బర్డ్‌ఫ్లూపై అప్రమత్తమైంది.
 
ఇలాంటి పరిస్థితుల్లో కొంతకాలం కోళ్లు, బాతుల మాంసం తినొద్దని కేరళ, మధ్యప్రదేశ్‌ అధికారులు ప్రజలకు సూచించారు. కేరళలోని ఆలప్పుళ జిల్లాలో కోళ్లు ఇతర పక్షుల మాంసం విక్రయాలను నిషేధించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎల్ఈడీ బల్బును మింగేసిన బాలుడు.. వైద్యులు ఎలా వెలికి తీశారంటే?