తమిళనాడు ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని విద్యార్థులందరికీ రోజుకు 2జీబీ చొప్పున మొబైల్ డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కే పళనిస్వామి ఆదివారం ప్రకటించారు.
విద్యార్థులు ఈ రోజు నుంచి వచ్చే ఏప్రిల్ మాసాంతం వరకు ఈ ఉచిత మొబైల్ డేటాను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ ప్రకటన ద్వారా రాష్ట్రంలోని 9 లక్షల మందికిపైగా విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని సీఎం చెప్పారు.
కొవిడ్ -19 విస్తరణ నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు తమిళనాడులోనూ విద్యాసంస్థలు మూతపడ్డాయి. కరోనా ప్రభావం ఇప్పటికీ పూర్తిగా తగ్గకపోవడంతో ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్నారు.
తమిళనాడులో యూజీ, పీజీ విద్యార్థులకు తరగతులు ప్రారంభమైనా.. ఎక్కువ మంది ఆన్‌లైన్ పాఠాలకే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ కాలేజీలతోపాటు స్కాలర్‌షిప్‌లతో చదువుకునే ప్రైవేట్ కాలేజీ విద్యార్థులందరికీ ఉచిత మొబైల్ డేటా ఈ సౌలభ్యం అందించనున్నట్టు ముఖ్యమంత్రి తన ప్రకటనలో వెల్లడించారు.
డేటా కార్డులను ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు లిమిటెడ్ ద్వారా అందించనున్నారు. ఆన్‌లైన్ పాఠాలు వినడానికి విద్యార్థులంతా ఉచిత మొబైల్ డేటాను వినియోగించుకోవాలని సీఎం పళనిస్వామి కోరారు.