రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దేశంలోని పలు రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో దీని కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గవర్నర్లకు సూచనలు చేయనున్నారు.
రాష్ట్రపతి నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీతోపాటు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొననున్నారు. రాష్ట్రపతి ప్రస్థుత కరోనా సంక్షోభ సమయంలో గవర్నర్లతో పరిస్థితిని సమీక్షించాలని నిర్ణయించారు. కరోనా వైరస్ అధికంగా ప్రబలిన 8 రాష్ట్రాల గవర్నర్లతో రాష్ట్రపతి ఇప్పటికే మాట్లాడారు.
1100 శాఖలున్న రెడ్ క్రాస్ సొసైటీకి రాష్ట్రపతి అధ్యక్షుడు. కరోనా వైరస్ కేసులు అధికంగా నమోదైన పంజాబ్, కేరళ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర గవర్నర్లతో రాష్ట్రపతి సవివరంగా మాట్లాడతారని రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. లాక్ డౌన్ సందర్భంగా పేదలకు ఆశ్రయం, ఆహారం అందించాలని రాష్ట్రపతి స్వచ్చంద సంస్థలను కోరనున్నారు.