Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా పదవిపై ఊగిసలాట..?

Advertiesment
Andhra Pradesh
, బుధవారం, 18 మార్చి 2020 (14:55 IST)
ఆయన రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేత. వరుసగా ఐదు పర్యాయాలు గెలుపొందడమేకాకుండా, మంత్రివర్గంలో కీలక పదవులు నిర్వహించారు. ఏ పార్టీలో ఉన్నా నిబద్ధతతో, విధేయతతో నడుచుకుంటారని ఆయనకు పేరుంది. వీటన్నింటికీ మించి మాటలో పదును, విమర్శలో సహేతుకత ఆయన సొంతం. రాష్ట్ర కమలదళంలో ఇప్పుడు ఆయనే కేంద్ర బిందువు. అయితే ఆయన స్థానంలో మరొకరు వస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయనలో అంతర్మథనం మొదలైందట. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆయన ఎలాంటి ఊగిసలాటలో ఉన్నారు? పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం తెలుసుకోవాల్సిందే.
 
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం కీలక పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాలలో ఇప్పటికే ప్రబలశక్తిగా ఉన్న బీజేపీకి ఏపీలోనూ ఇమేజ్ పెరుగుతోంది. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ వైపు చూస్తున్నాయి. అలాంటి పార్టీకి రాష్ట్రంలో సారథ్యం వహిస్తున్న కన్నా లక్ష్మీనారాయణ పదవిపై ఊగిసలాట మొదలైందట. ఆయన స్థానంలో మరొకరిని నియమిస్తారనే ప్రచారం ప్రారంభమైంది. అందుకోసం విశాఖపట్నానికి చెందిన ఎమ్మెల్సీ మాధవ్ పేరు పరిశీలనలో ఉందని చెబుతున్నారు. 
 
నిజానికి రాష్ట్రంలో కన్నాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు అంశంపై సీఎం జగన్మోహన్ రెడ్డి శాసనసభలో ప్రకటన చేసిన వెంటనే.. రాష్ట్రంలో తొలిసారిగా స్పందించిన నాయకుడు కన్నా లక్ష్మీనారాయణే. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి వికేంద్రీకరణను కోరుకుంటుందనీ, పాలనా వికేంద్రీకరణను కోరుకోవడం లేదనీ ఆయన వ్యాఖ్యానించారు. ఈ విమర్శ వైసీపీకి సూటిగా తాకింది. రాష్ట్రంలో బీజేపీ వైఖరిని స్పష్టం చేసింది. పార్టీ కార్యవర్గ సమావేశంలో అమరావతే రాజధాని అని ఏకగ్రీవ తీర్మానం కూడా చేశారు. కన్నా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చేసిన తీర్మానం అమరావతి ఉద్యమానికి దన్నుగా నిలిచిందని పరిశీలకులు చెబుతున్నారు.
 
అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలపైనా బీజేపీ రాష్ట్ర సారథి కన్నా లక్ష్మీనారాయణ తనదైన శైలిలో గళం వినిపిస్తున్నారు. ఇసుక కొరత, బస్సు చార్జీల పెంపు, గ్రామ వాలంటీర్ల నియామకం వంటి అంశాలపై ఆయన ధ్వజమెత్తారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలపైనా కన్నా సంధించిన విమర్శనాస్త్రాలు అధికార వైసీపీకి ఘాటుగానే తగిలాయి. ఇలా ఆయన తరచూ విమర్శలకు దిగుతుండటాన్ని.. రాష్ట్రంలో అధికార వైసీపీకి జీర్ణించుకోలేకపోతోందట. 
 
మరోవైపు బీజేపీలోని ఒకరిద్దరు నేతలు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనుకేసుకురావడం, రాజధాని అంశంలో చేస్తున్న వ్యాఖ్యలు కన్నా లక్ష్మీనారాయణకు ఇబ్బందిగా మారాయట. అంతర్గత సమావేశాల్లో ఈ అంశంపై ఆయన అంతర్మథనం చెందుతున్నారట. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతల్లో కొందరికి బీజేపీ కేంద్ర పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం ఉందట. దీంతో వారు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి కన్నాని మార్చాలంటూ ఢిల్లీలో పావులు కదుపుతున్నారట. 
 
ఈ విషయాన్ని ఢిల్లీలోని బీజేపీ పెద్దలు కూడా పరిగణనలోకి తీసుకున్నారనీ, అందుకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పునకు సంకేతాలు వస్తున్నాయనీ కమలనాథుల్లో చర్చ జరుగుతోంది. వైసీపీతోపాటు తెలుగుదేశం పార్టీపైనా విమర్శనాస్త్రాలు సంధిస్తున్న బీజేపీ రాష్ట్ర సారథి కన్నా లక్ష్మీనారాయణ పదవికి ఢోకా ఉండదనేది ఆయన అనుచరుల వాదనగా ఉంది. ఈ విషయంలో బీజేపీ హైకమాండ్ స్పష్టత ఇస్తే బాగుంటుందని వారు సూచిస్తున్నారు. 
 
మరోవైపు తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీ సారథులను మార్చిన బీజేపీ అధిష్టానం.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం స్థానిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అధ్యక్షుడి మార్పు మంచిది కాదని భావిస్తోందట. ఈ కారణంగానే కన్నా లక్ష్మీనారాయణను మార్చే విషయంపై నిర్ణయం వెలువడలేదట. ఇదిలావుంటే రాష్ట్రంలో సమస్యలపై కలిసి పోరాడాలని జనసేన - బీజేపీ నేతలు నిర్ణయించారు. 
 
ఇందులో రాజధాని అమరావతి అంశం కూడా ఉంది. ఇందుకోసం ఉమ్మడి కార్యాచరణను కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే ఏమైందో ఏమో గానీ దాన్ని ఆచరణలో పెట్టలేదు. దీంతో అమరావతి ఉద్యమంలో వెనుకంజ వేశారనే భావన రాజధాని ప్రాంత రైతుల్లో నెలకొంది. ఈ విషయాన్ని కమలనాథులు కూడా అంగీకరిస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళన చేపట్టడంలో, రాష్ట్రంలో బలపడేందుకు ఉన్న అవకాశాలను, ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ఉన్న రాజకీయ శూన్యతను బీజేపీ ఉపయోగించుకోవడం లేదనే భావన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. 
 
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన- బీజేపీ మధ్య పొత్తు ఉంది. అయితే ఇది క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కావడం లేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇరుపక్షాల నేతలూ ఆఫ్ ద రికార్డ్‌గా అంగీకరిస్తున్నారు. అయితే జనసేనాని పవన కల్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడంతో.. కన్నాని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తున్నారనే వాదన ప్రచారంలో ఉంది. దీన్ని కన్నా అనుచరులు, వర్గీయులు అంగీకరించడం లేదు. 
 
పార్టీ పట్ల అంకితభావం, నాయకత్వం పట్ల విధేయత, పనితీరు పరిగణలోకి తీసుకోవాలి గానీ, సామాజిక సమీకరణలను అధ్యక్షుడి ఎంపికలో చూస్తారా? అని బీజేపీలోని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి పదవి మార్పునకు సంబంధించిన సంధికాలంలో కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారనీ, అందుకే ఆయన ఇప్పుడు ఊపుమీద లేరనీ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి కన్నా విషయంలో బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలికకు ఆటో డ్రైవర్ వేధింపులు, దేహశుద్ధి చేసిన ఆమె తల్లి, వీడియో వైరల్