Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మానవత్వం లేని మృగం కేసీఆర్ : తెలంగాణ బీజేపీ

Advertiesment
మానవత్వం లేని మృగం కేసీఆర్ : తెలంగాణ బీజేపీ
, సోమవారం, 16 మార్చి 2020 (08:05 IST)
కేసీఆర్ మానవత్వం లేని మృగం ఆని తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఏ మతానికి వ్యతిరేకం కాదని, అన్ని వర్గాలను సమానంగా చూస్తుందని బండి సంజయ్‌ తెలిపారు.

అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనేనని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు.

ఎందరో యువకుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో సీఎం కేసీఆర్‌ రాజ్యం ఏలుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ కార్యకర్తలు, యువకుల మీద ఒక్క లాఠీ దెబ్బ పడినా కేసీఆర్‌ గుండెల్లో నిద్రపోతామని హెచ్చరించారు.

నమ్మిన సిద్ధాంతం, పేదల కోసం కట్టుబడి ఉంటామని చెప్పారు. ఎంఐఎంతో కలిసి టీఆర్‌ఎస్‌ పార్టీ ఒక నియంతలా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలోకి రావాల్సిందేనని, కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడాల్సిందేనని చెప్పారు. కేటీఆర్‌ని సీఎం చేయడం కోసం యాగాలు చేయడం హిందూ ధర్మం కాదని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

"జాతీయ వాదమే ఊపిరిగా మీ అందరితో పని చేసిన నాకు పార్టీ పగ్గాలు అందించడం పార్టీ గొప్పదనం, కార్యకర్తల గొప్పదనం. నన్ను అధ్యక్ష్యుడిగా నియమించిన పార్టీ కేంద్ర నాయకత్వానికి, మోడీ, అమిత్ షా, రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు. నన్ను అనేకసార్లు కాపాడుతూ ఆదరించిన సాధు సంతువులందరికి పాదాభి వందనాలు. కేసీఆర్ కు కరోనా భయం కాదు, కమలం భయం పట్టుకుంది.

ఎంతో మంది ఉగ్రవాదుల చేతుల్లో జాతీయవాదులు ప్రాణాలు కోల్పోయారు. ఈ రాష్ట్రంలో గోల్కొండ కోటపై కాషాయ జెండా రెపరెపలాడిస్తా. కేంద్రం వద్దకు వచ్చే దమ్ము కేసీఆర్ కు ఉందా? వస్తే నిధులు ఇప్పించే దమ్ము నాకు ఉంది. మతతత్వ పార్టీ అంటూ హిందువులపై, అరాచకం అక్రమ కేసులు పెడితే కేసీఆర్  గుండెల్లో నిద్రపోతా. హిందుత్వ మూల సిద్ధాంతం బీజేపీ సిద్ధాంతం.

తెలంగాణలో వీరి విధ్వంసాన్ని  దించాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి. బైంసాలో చిన్న పిల్లలు, మహిళలు, తమ్ముళ్లు 'కాపాడండి కాపాడండి' అన్న అంటూ ఆర్తనాదాలు చేసిన ఘటన ఇంకా నా కళ్ళముందు కదలాడుతుంది. వస్తా మళ్ళీ బైంసాకు వస్తా. జైలుకు పంపిన తమ్ముళ్లను గుండెకు హత్తుకోవడానికి వస్తా. బండి సంజయ్ రూటు మార్చడు. కార్యకర్తలకు అండగా ఉంటా. ఎన్ని కేసులైనా ఎదుర్కొంటా.

భయంకరమైన హిందువును నేను అంటున్నాడు కేసీఆర్. నువ్వు చేసే యాగాలు నీ కొడుకుని సీఎం చేయడానికే. హిందూ సమాజానికి ఆపద వస్తే నిలబడేవాడే నిజమైన హిందువు. కేసీఆర్! నువ్వు రాష్ట్రంలో పథకాలకు ఇచ్చే డబ్బు ఎవడబ్బ సొత్తు? నీ అబ్బా సొత్తా? తెలంగాణ ప్రజల సొమ్ము. కేంద్రం ఇచ్చే డబ్బుల లెక్కలు కేసీఆర్ చెప్పాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, రుణ మాఫీ రైతులకు లేదు,విద్య వ్యవస్థ నిర్వీర్యం చేసాడు కేసీఆర్.

ఏబీవీపీ విద్యార్థులు రక్తం వచ్చేలా కొట్టారు. కేసీఆర్ మానవత్వం లేని మృగం. ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా? త్వరలో టీఆరెస్ గడీలను కూల్చేస్తాం. మైనారిటీ ఓటు బ్యాంకు ద్వారా రాష్ట్రాన్ని ఏలాలని చూస్తున్న కేసీఆర్ ను గద్దె దించుతాం. బీజేపీ ఏ మతానికి వ్యతిరేకం కాదు. ఖబడ్దార్ కేసీఆర్! ఈ రోజు నుండే యుద్ధం మొదలైంది. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. నేను భయపడే వ్యక్తిని కాదు కేసీఆర్. మా తమ్ముళ్లను అరెస్ట్ చేస్తే నేను అడ్డంగా నిలబడతా. 
 
జైళ్లు సరిపోవు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి జైళ్లు కట్టుకో. కొట్టడానికి లాఠీలు సరిపోవు, లాఠీలు తెచ్చుకో కేసీఆర్.  కరోనా లేదు అన్నాడు, పారసేటమాల్ వేసుకోమన్నాడు కేసీఆర్.  ఈ కేసీఆర్ పారాసేటమాల్ ఏంది అని దేశం మొత్తము నవ్వుతుంది. ఎప్పుడు ఏం మాట్లాడుతాడో కేసీఆర్ కె తెల్వదు.

త్వరలో పాదయాత్ర నిర్వహిస్తా. రథ యాత్ర చేస్తా. ప్రతి గ్రామానికి, మండలానికి వస్తా. విజయమో వీర స్వర్గమో తేల్చుకుంటా. శివాజీ వారసులు బీజేపీ అయితే, ఔరంగజేబు వారసులు ఎంఐఎం వాళ్లు" అంటూ నిప్పులు చెరిగారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్నికల ప్రక్రియ మొత్తం రీషెడ్యూల్ చేయాలి: టీడీపీ