టెక్నాలజీ మాయలో పడి సాటి మనిషికి సహాయ పడాలన్నా విషయాన్నీ మరుస్తున్నారన్న దానికి ఈ ఫోటేనే ఉదాహరణ. ఇందులో కనిపిస్తున్న వ్యక్తి చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అతన్ని అతి కష్టం మీద చికిత్సం కోసం తీసుకెళుతున్నారు.
అయితే ఆ వ్యక్తిని ఫోటోలైతే తీస్తున్నారు కానీ అతనికి సహాయం చేయలేదు. ఈ అమానవీయ ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది.
తమిళనాడులోని విల్లుపురం జిల్లాకు చెందిన సుబ్రమణి తన భార్య సోదరి కుటుంబాన్ని కలిసేందుకు పుదుచ్చేరిలోని సుతుకేనికి వచ్చాడు. క్షయ వ్యాధితో బాధపడుతున్న అతడి ఆరోగ్యం బుధవారానికి పూర్తిగా క్షీణించింది. దాంతో ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించేందుకు ఉపక్రమించారు కుటుంబసభ్యులు.
అయితే కూలి చేసుకొని బ్రతికే సుబ్రమణి బంధువుల వద్ద కనీసం మొబైల్ ఫోన్ కూడా లేదు.. దాంతో అంబులెన్సుకు ఫోన్ చేయలేకపోయారు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న తోపుడు బండిలో అతడిని తీసుకుని భార్యభర్తలిద్దరూ సుబ్రమణిని ఆస్పత్రికి తీసుకెళుతున్నారు.
ఇక్కడ అవమానం ఏమిటంటే వారి బాధలు చూసిన బాటసారులు ఫొటోలు, వీడియోలు తీశారు గానీ సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. కనీసం అంబులెన్సుకు ఫోన్ చెయ్యాలన్న ఆలోచన కూడా చేయలేదు.
సరైన సమయంలో అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. కనీసం ఒకగంట ముందు ఆసుపత్రికి తీసుకువెళ్లినా అతను బ్రతికేవాడని బంధువులు వాపోయారు.
ఇదిలావుంటే మరణించిన సుబ్రమణిని ఇంటికి తీసుకెళ్లే విషయంలో కూడా వారికి చేదు అనుభవం ఎదురైంది. పుదుచ్చేరి సరిహద్దులో ఉన్న ఆసుపత్రి నుంచి 25 కిలోమీటర్ల దూరం ఉన్న వారి ఊరికి తీసుకెళ్లేందుకు వాహనాలకు అనుమతి లేకపోవడంతో.. శవంతో ఆస్పత్రి వద్దే ఉండిపోయారు బంధువులు.
విషయం తెలుసుకున్నఓ పోలీస్ అధికారి మురుగనందన్ ఆస్పత్రికి వచ్చి ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా అంబులెన్సును రప్పించి సుబ్రమణి శవాన్ని సొంతూరికి తరలించారు. అనంతరం మాట్లాడిన మురుగనందన్.. అతనికి చావుకు అందరం కారణమని అన్నారు.
సకాలంలో అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లడంలో మనమంతా సహాయం చెయ్యలేదని అన్నాడు. సాటి మనిషి కష్టాల్లో ఉంటే ఇలా వదిలేయడం చాలా తప్పు అని అన్నారు. కాగా సుబ్రమణిని అతని సొంత ఊరికి తీసుకువెళ్లి అక్కడే దహనం చేశారు.