Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వీడని 'మహా' పీటముడి, 'చిరుతపులి' దెబ్బకు 'కమలం' కుదేలు

Advertiesment
Maharastra
, శనివారం, 2 నవంబరు 2019 (18:12 IST)
అధికారాన్ని చెరో సగం పంచుకోవడంపై భాజపా, శివసేన మధ్య విభేదాలతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది.

భాజపా లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తోన్న శివసేన నేత సంజయ్‌రౌత్‌.. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో చర్చలు జరిపారు. అయితే తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని పవార్‌ స్పష్టం చేయగా తాజా పరిణామాలపై కాంగ్రెస్‌వేచి చూసే ధోరణి అవలంబిస్తోంది.

శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడి 9 రోజులు అవుతున్నా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియపై పీటముడి వీడడం లేదు. ఈనెల 8తో మహారాష్ట్ర ప్రస్తుత శాసనసభ గడువు ముగిసి కొత్త సర్కార్‌ కొలువుదీరాల్సి ఉండగా ఆ ప్రక్రియ దిశగా అడుగులు పడడం లేదు.

కూటమిగా విజయం సాధించిన భాజపా, శివసేన మధ్య విభేదాలతో... ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి పీఠం సహా పదవులు సగం సగం ఇవ్వాలని ఫలితాల నాటి నుంచి పట్టుబడుతూ వస్తున్న శివసేన అదే పంతం కొనసాగిస్తుంది.

తాజాగా ఆ పార్టీ నేత సంజయ్‌ రౌత్‌.. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో భేటీ అయి తమ పార్టీ ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సాయం చేయాలని అభ్యర్థించారు. శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే.. పవార్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారనే వార్తలను ఇరు పార్టీలు ధ్రువీకరించాయి.

అయితే శరద్‌పవార్‌ మాత్రం భిన్నంగా స్పందించారు. ప్రజలు తమను ప్రతిపక్షంలో కూర్చోవాలని తీర్పు ఇచ్చారని తాము అదే పని చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా, శివసేనకు అవకాశం ఇచ్చారన్న పవార్‌.. వారు ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

భాజపా, శివసేన మధ్య విభేదాలను పవార్‌ చిన్న పిల్లల ఆటగా అభివర్ణించారు. అటు మహారాష్ట్ర పరిణామాలపై కాంగ్రెస్‌ వేచి చూసే ధోరణి అవలంబిస్తోంది.

తాజా పరిణామాలపై మహారాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు అశోక్‌ చవాన్‌, పృథ్వీరాజ్ చవాన్‌, బాలా సాహెబ్‌ థోరట్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో చర్చించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న శివసేన సహా.. భాజపా వైఖరిని కాంగ్రెస్‌ గమనిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

భాజపా- 'రాష్ట్రపతి పాలన' వ్యాఖ్యలపై శివసేన ఫైర్​
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని భాజపా నేత, రాష్ట్ర మంత్రి సుధీర్​ ముంగంటీవార్​ చేసిన వ్యాఖ్యలపై శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది.

రాష్ట్రపతి ఏమైనా మీ (భాజపా) జేబులో ఉన్నారా? అంటూ ప్రశ్నించింది. రాష్ట్రపతి పాలన గురించి మాట్లాడేవారు ముందు ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించాలని సూచించింది. మహారాష్ట్రలో భాజపా-శివసేనల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది.

నవంబర్​7 నాటికి ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాష్ట్రపతి పాలన విధించవచ్చంటూ భాజపా నేత, రాష్ట్ర మంత్రి సుధీర్​ ముంగంటీవార్​ చేసిన వ్యాఖ్యలను సేన తిప్పికొట్టింది. ఆ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. రాష్ట్రపతి ఏమైనా మీ(భాజపా) జేబులో ఉన్నారా..? అంటూ తన అధికార పత్రిక సామ్నాలో ప్రశ్నించింది.

రాష్ట్రపతి పాలన వ్యాఖ్యల నేపథ్యంలో ముంగంటీవార్​పై ఎదురుదాడికి దిగింది సేన. ఆయన వ్యాఖ్యలు అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌ లో ‘మత్తు’ వదులుతోంది?