కరోనా వైరస్ బంధాలు, అనుబంధాలను దూరం చేస్తున్నారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సామాజికదూరం పాటిస్తున్నారు. చివరకు కన్నబిడ్డలను కూడా తల్లిదండ్రులు దూరంగా ఉంచుతున్నారు. ఈ కరోనా వైరస్ మహమ్మారి బారినపడకుండా ఉండేందుకు అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో కరోనా గొలుసుకట్టును ఛేదించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ సమయంలో ఏ ఒక్కరూ బయటకు వెళ్లడానికి వీల్లేదని కోరుతున్నారు. అయితే, చాలామంది యువతి ఈ ఆంక్షలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అలాగే, ముంబైలోని కాందీవలీ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఇదే పనిచేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతని అన్న... తమ్ముడిపై దాడి చేశాడు. ఈ దాడిలో అతను చనిపోయాడు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైలోని కాందీవలీ ప్రాంతానికి చెందిన దుర్గేశ్ అనే వ్యక్తి పుణెలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. కరోనా భయంతో ఇటీవలే ఇంటికి వచ్చాడు. బుధవారం రాత్రి బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చాక అతని అన్న రాజేశ్ ఠాకూర్, వదిన కోపగించుకున్నారు. బయటకు వెళ్లొద్దని ప్రాధేయపడ్డారు. కానీ అతని చెప్పినమాట వినలేదు.
దీంతో అతనికి వైరస్ సోకితే అది తమకు కూడా సోకుతుదని భయపడ్డారు. ఇదే విషయంపై అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది. ఇది పెద్దదైంది. ఈ క్రమంలో రాజేశ్ ఠాకూర్ తీవ్ర ఆవేశానికిలోనై తన తమ్ముడిపై దాడి చేయగా, అతను ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని రాజేశ్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.