ఐదు సంవత్సరాలు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఒకరు లేనిదో మరొకరు లేరని అనుకున్నారు. పెద్దలు వారిద్దరి పెళ్ళి చేశారు. అయితే పెళ్ళయిన కొన్ని నెలలకే భార్యపై అనుమానం పెంచుకున్నాడు భర్త. గతంలోలా తనతో లేదని ఆవేదనకు గురయ్యాడు. నిద్రిస్తున్న భార్యను అతి కిరాతకంగా చంపేశాడు. అంతటితో ఆగలేదు ఆమెను తీసుకెళ్ళి పొలంలో పూడ్చేశాడు. చిత్తూరు జిల్లాలో సంఘటన చోటుచేసుకుంది.
కురబలకోట మండలం పెద్దపల్లికి చెందిన మల్లిరెడ్డి, గాయత్రిలకు సంవత్సరం క్రితం వివాహమైంది. ఇద్దరు ఒకే గ్రామానికి చెందిన వారు. ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఇష్టపడటంతో పెద్దలు పెళ్ళిళ్ళు చేశారు. మొదటి మూడునెలల పాటు భార్యతో ఎంతో అన్యోన్యంగా ఉన్నాడు మలిరెడ్డి. కానీ ఆ తరువాత ఆమెపై లేనిపోని అనుమానాలు పెంచుకున్నాడు.
తన భార్య కొంతమంది యువకులతో సన్నిహితంగా ఉందని ఊహించుకున్నాడు. గ్రామంలో కొంతమంది యువకులతో తన భార్య మాట్లాడడం చూసి ఓర్చుకోలేకపోయాడు. ఆమెపై కోపం పెంచుకున్నాడు. నిన్న రాత్రి నిద్రిస్తున్న గాయత్రిని రోకలి బండతో కొట్టి చంపేశాడు.
ఆ తరువాత ఎవరికి అనుమానం రాకుండా తన పొలంకు తీసుకెళ్ళి శవాన్ని పూడ్చి ట్రాక్టర్‌తో చదును చేసి ఏమీ ఎరుగనట్లు పోలీస్టేషన్లో తన భార్య కనిపించలేదని ఫిర్యాదు చేశాడు. మొదట్లో పోలీసులు గ్రామంలో ఎవరో చేసి ఉంటారని అనుకున్నారు. కానీ భర్త కదలికల్లో అనుమానం రావడంతో అతన్ని విచారిస్తే నిజాన్ని ఒప్పుకున్నాడు. పొలం నుంచి మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిమిత్తం మదనపల్లి ఆసుపత్రికి పంపించారు.