Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా వైరస్: అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా?

webdunia
గురువారం, 26 మార్చి 2020 (19:22 IST)
ప్రపంచానికి ఇవి మంచి రోజులు కావు. అమెరికా - చైనాల మధ్య సంబంధాలకూ ఇవి మంచి రోజులు కావు. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్.. పనిగట్టుకుని కరోనావైరస్‌ను పదేపదే చైనా వైరస్ అని పిలుస్తున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో ఆ వైరస్‌ను 'వుహాన్ వైరస్' అని పిలుస్తున్నారు. ఇది చైనాకు చాలా కోపం తెప్పిస్తోంది.

 
వైరస్ తొలుత మనుషులకు సోకటం మొదలైనపుడు నియంత్రించటంలో చైనా విఫలమైందని ట్రంప్, పాంపేయో ఇద్దరూ తప్పుపట్టారు. కానీ ఏం జరుగుతోందనే విషయంలో తాము పూర్తి పారదర్శకంగా లేమన్న వాదనను చైనా అధికార ప్రతినిధులు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.

 
మరోవైపు, ఈ మహమ్మారికి కారణం అమెరికా సైన్యపు క్రిమి యుద్ధ కార్యక్రమం అంటూ చైనా సోషల్ మీడియాలో కథనాలు ప్రచారమవుతున్నాయి. ఈ వదంతులు గణనీయంగానే వ్యాపిస్తున్నాయి. అయితే.. ఈ వైరస్ నిర్మాణం పూర్తిగా సహజంగానే పుట్టుకొచ్చిందని శాస్త్రవేత్తలు నిరూపించారు. కానీ.. ఇది కేవలం మాటల యుద్ధం మాత్రమే కాదు. అంతకన్నా మౌలికమైనదేదో జరుగుతోంది.

 
ఈ నెల మొదట్లో అమెరికా తన సరిహద్దులను ఇటలీ సహా యూరోపియన్ యూనియన్ దేశాలకు కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించినపుడు.. ఇటలీకి తాము వైద్య బృందాలు, సరఫరాలను పంపిస్తున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఇటలీలో ఇప్పుడు కరోనావైరస్ మహమ్మారిలా వ్యాపిస్తోంది. ఇరాన్, సెర్బియాలకు కూడా చైనా సాయం పంపించింది.

 
ఇది తెర వెనుక జరుగుతున్నసమాచార యుద్ధాలకు సంకేతం. ఈ సంక్షోభం నుంచి బయటపడి, అంతర్జాతీయ శక్తిగా తన హోదాను పునరుద్ధరించుకోవటానికి చైనా తాపత్రయపడుతోంది. నిజానికి ఈ యుద్ధంలో అమెరికా అస్త్రసన్యాసం చేసి ఓడిపోతోంది. ఆలస్యంగా ఒక చిన్న అమెరికా వైమానిక దళ వైద్య సదుపాయాన్ని పంపించటం వల్ల సమీకరణాలు మారేదేమీ లేదు.

 
ఇది.. అన్ని దేశాల పరిపాలన, రాజకీయ వ్యవస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న పరీక్షా సమయం. నాయకత్వం మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఈ అవకాశాన్ని ఎవరు ఎలా ఉపయోగించుకున్నారు, వారి చర్యల్లో స్పష్టత ఎంత, వారి సామర్థ్యం ఎంత, మహమ్మారిపై పోరాటానికి తమ దేశ వనరులను ఎలా వినియోగించారు అనే అంశాలపై ప్రస్తుత నాయకులు బోనులో నిలబడాల్సి ఉంటుంది.

 
అమెరికా - చైనా సంబంధాలు అప్పటికే తీవ్రంగా దెబ్బతిని ఉన్న సమయంలో ఈ మహమ్మారి పంజా విసిరింది. రెండు దేశాల మధ్య నెలకొన్న వ్యాపార ఉద్రిక్తతలను ఇటీవలి పాక్షిక వాణిజ్య ఒప్పందం పెద్దగా తగ్గించలేదు. ఆసియా-పసిఫిక్‌లో తలెత్తగల భవిష్యత్ సంఘర్షణ కోసం చైనా, అమెరికా రెండూ మళ్లీ బలాలు సమీకరించుకుంటున్నాయి. చైనా ఇప్పటికే - కనీసం ప్రాంతీయంగానైనా ఒక సైనిక సూపర్-పవర్‌గా అవతరించింది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి కోసం తనకు అవసరమైన మరింత విస్తృతమైన హోదా కోసం చైనా తహతహలాడుతోంది.

 
అమెరికా - చైనా సంబంధాలను ఈ మహమ్మారి మరింత క్లిష్టమైన దశలోకి తీసుకెళుతున్నట్లు కనిపిస్తోంది. ఇది.. ఈ సంక్షోభం పయనించే దిశ మీద, తదనంతరం ఉద్భవించే ప్రపంచం మీద కూడా ముఖ్యమైన ప్రభావం చూపవచ్చు. ఈ వైరస్‌ను జయించిన తర్వాత.. కుదేలైన ప్రపంచ ఆర్థికవ్యవస్థను పునర్నిర్మించటంలో చైనా ఆర్థిక పునరుద్ధానం కీలక పాత్ర పోషించబోతోంది.

 
కానీ ఇప్పటికైతే.. కొత్త కరోనావైరస్ మీద పోరాడటానికి చైనాసాయం చాలా అవసరం. వైద్య సమాచారం, అనుభవాలను పంచుకోవటం కొనసాగించాల్సిన అవసరముంది. వైద్య పరికరాలు, మాస్కులు, ప్రొటెక్టివ్ సూట్లు వంటి వైద్య రక్షణ పరికరాలు కూడా చైనాలో భారీగా తయారవుతాయి. వైరస్ సోకిన రోగులకు చికిత్స చేయటానికి ఇవి భారీ స్థాయిలో అవసరం.

 
చైనా చాలా రకాలుగా ప్రపంచంలో వైద్య పరికరాల తయారీ కేంద్రం. ఈ దేశం తరహాలో ఉత్పత్తిని విస్తరించే సామర్థ్యం అతి తక్కువ దేశాలకు మాత్రమే ఉంది. ఈ అవకాశాన్ని చైనా అందిపుచ్చుకుంటోంది. కానీ.. అమెరికా దీనిని జారవిడుచుకుందని చాలా మంది అంటున్నారు.

 
ఈ సంక్షోభం తీవ్రతను అంగీకరించటంలో ట్రంప్ ప్రభుత్వం తొలుత విఫలమైంది. 'అమెరికాకే ప్రాధాన్యం' అనే తమ విధానానికి మరొక అవకాశంగా భావించింది. కానీ ఇప్పుడు ఆ దేశ ప్రపంచ నాయకత్వం ప్రమాదంలో పడింది. ఒబామా ప్రభుత్వంలో తూర్పు ఆసియా, పసిఫిక్ వ్యవహారాలకు సహాయ విదేశాంగ మంత్రిగా పనిచేసిన కర్ట్ ఎం క్యాంప్‌బెల్, ఆసియా వ్యవహారాల నిపుణుడు రష్ దోషి ఇటీవల 'ఫారిన్ అఫైర్స్'లో ఒక వ్యాసం రాశారు.

 
''ప్రపంచ నాయకుడిగా గత ఏడు దశాబ్దాలుగా గల అమెరికా హోదాను కేవలం సంపద, శక్తితో మాత్రమే నిర్మించలేదు. అంతర్గత ప్రభుత్వ విశ్వసనీయత, అంతర్జాతీయంగా ప్రజల మేలుకు తోడ్పడటం, ఒక సంక్షోభానికి అంతర్జాతీయ ప్రతిస్పందనను కూడగట్టి సమన్వయం చేయటానికి సంసిద్ధత, చేయగల సామర్థ్యం కూడా దీనికి కారణం'' అని వారు అందులో పేర్కొన్నారు.

 
ఈ కరోనావైరస్ మహమ్మారి.. అమెరికా నాయకత్వంలో ఈ మూడు అంశాలనూ పరీక్షిస్తోందని వారు అంటారు. ''ఇప్పటివరకూ అమెరికా ఈ పరీక్షలో విఫలమవుతోంది. అమెరికా తప్పులతో తలెత్తిన ఖాళీని అవకాశంగా తీసుకోవటానికి చైనా వేగంగా కదులుతోంది. మహమ్మారిని ఎదుర్కోవటంలో తనను తాను ప్రపంచ నాయకురాలిగా ప్రతిష్టించుకుంటోంది'' అని విశ్లేషించారు.

 
అయితే.. ఇటువంటి సమయంలో చైనా తనకు అనుకూలంగా అవకాశాన్ని ఎలా మలచుకోగలదని చాలా మంది ఆశ్చర్యపోవచ్చు. ఈ మహమ్మారి చైనాలోనే ఆరంభమైనట్లు కనిపిస్తోంది కాబట్టి ఆ దేశం అత్యంత ఆత్మవిశ్వాసంతో ఈ పని చేయగలదని క్యాంప్‌బెల్, దోషి అంటారు. ఉహాన్‌లో ఈ సంక్షోభం తలెత్తినపుడు చైనా ముందుగా స్పందించిన తీరు రహస్యంగా సాగింది. కానీ ఆ తర్వాత తన విస్తారమైన వనరులను సమర్థవంతంగా, మెప్పించేలా మోహరించింది.

 
''వైరస్ విజృంభణను మొదట తిరస్కరించటం, నిర్వహణ వైఫల్యాల పట్ల సామాజిక అశాంతి తలెత్తుతుందనే భయంతో చైనా ఇప్పుడు దేశంలోనూ, అంతర్జాతీయంగానూ దూకుడుగా ప్రచార కార్యక్రమం మొదలుపెట్టింది. మహమ్మారి విషయంలో తన అమానుష వైఖరిని మరుగునపరచటం, ప్రపంచమంతటా విస్తరించటానికి దారితీయటంలో తన పాత్రను తక్కువచేసి చూపటం, పశ్చిమ దేశాల ప్రభుత్వాలు - ముఖ్యంగా అమెరికా కృషి కన్నా తన కృషి మెరుగుగా ఉందని చాటటం ఈ ప్రచారం ఉద్దేశం'' అని పత్రికా స్వాతంత్ర్య సంస్థ 'పెన్ అమెరికా' సీఈఓ సుజాన్ నోసెల్ ఒక వ్యాసంలో పేర్కొన్నారు.

 
చైనా మరింత అధికారవాదిగా, మరింత జాతీయవాదిగా మారుతోందని చాలా మంది పశ్చిమ వ్యాఖ్యాతలు భావిస్తున్నారు. ఈ పోకడలు.. మహమ్మారి ప్రభావం, దాని వల్ల తలెత్తే ఆర్థిక మాంద్యాలతో మరింతగా పెరుగుతాయని భయపడుతున్నారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో అమెరికా స్థానం మీద ఈ ప్రభావం మరింత అధికంగా ఉంటుంది.

 
అమెరికా మిత్రపక్షాలు దీనిని గమనిస్తున్నాయి. వారు ట్రంప్ ప్రభుత్వాన్ని బాహాటంగా విమర్శించకపోవచ్చు. కానీ చాలా మందికి.. చైనా పట్ల, చైనా సాంకేతిక పరిజ్ఞానం (హువే వివాదం) పట్ల, ఇరాన్ తదితర ప్రాంతీయ అంశాల విషయంలో ట్రంప్ సర్కారు వైఖరులతో స్పష్టమైన విభేదాలు ఉన్నాయి.

 
భవిష్యత్తులో భిన్నమైన సంబంధాల కోసం ప్రాతిపదికలను నెలకొల్పుకోవటానికి చైనా ఈ మహమ్మారికి సహాయ హస్తం అందిస్తూ దీనిని ఉపయోగించుకుంటోంది. చైనా శరవేగంగానే ఒక ''అవసరమైన శక్తి''గా మారిపోవచ్చు. కరోనావైరస్‌ మీద పోరాడటంలో తన సమీప పొరుగు దేశాలైన జపాన్, దక్షిణకొరియాలతో సంబంధాలు నెలకొల్పుకోవటం, యూరోపియన్ యూనియన్‌కు కీలకమైన వైద్య పరికరాలు అందించటాన్ని ఈ కోణంలో చూడొచ్చు.

 
క్యాంప్‌బెల్, దోషిలు ఈ పరిణామాలను.. బ్రిటన్ పతనంతో వివరంగా పోల్చిచూపారు. ''1956లో సూయిజ్ కెనాల్‌ను స్వాధీనం చేసుకోవటానికి బ్రిటిష్ ప్రభుత్వం చేసిన విఫలయత్నం.. బ్రిటన్ బలాన్ని దెబ్బతీసింది. అంతర్జాతీయ శక్తిగా యునైటెడ్ కింగ్‌డమ్ పాలనకు ముగింపు పలికింది'' అని పేర్కొన్నారు. ''పరిస్థితులను ఎదుర్కోవటానికి అమెరికా ధైర్యంగా నిలబడకపోతే.. ఈ కరోనావైరస్ మహమ్మారి మరో 'సూయిజ్ పరిణామం'గా మారగలదని ఇప్పుడు అమెరికా విధాన రూపకర్తలు గుర్తించాలి'' అని వారు హితవుపలికారు.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

వందో రోజుకు రాజధాని రైతుల ఉద్యమం