అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోనులో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ బుధవారం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
'అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపేందుకు జో బైడెన్‌తో నేను ఫోనులో మాట్లాడాను. అమెరికా, భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించాలని మేము నిర్ణయించాం. పలు ప్రాధాన్యతాంశాలు, సవాళ్లు మా మధ్య చర్చకు వచ్చాయి. కొవిడ్-19 మహమ్మారి, వాతావరణ మార్పులు, ఇండో పసిఫిక్ రీజియన్‌లో సహాయ సహకారాలు సహా పలు అంశాల గురించి మాట్లాడుకున్నాం' అని మోడీ తన ట్వీట్‌లో వివరించారు.
కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించగా, ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన విషయం తెల్సిందే. అయినప్పటికీ ట్రంప్ అధ్యక్ష పదవిని వదిలిపెట్టేందుకు ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలో అమెరికాలో అధికార మార్పిడికి ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.