Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వామ్మో.. కరోనాతో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ... ఇపుడు 'పంచాయతీ'నా?

వామ్మో.. కరోనాతో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ... ఇపుడు 'పంచాయతీ'నా?
, బుధవారం, 18 నవంబరు 2020 (08:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో వార్ మొదలైంది. ఇప్పటికే వైకాపా ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఏమాత్రం పొసగడం లేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. వచ్చే ఫిబ్రవరిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన బుధవారం రాష్ట్ర గవర్నరు హరిచందన్‌తో సమావేశం కానున్నారు. 
 
అయితే, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహి స్పందించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తున్న వేళ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌కు లేఖ రాశారు. పైగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదని, కరోనా నేపథ్యంలో చలికాలంలో మరింత అప్రమత్తత అవసరమని కేంద్రం హెచ్చరించిన విషయాన్ని సీఎస్ ఆ లేఖలో ప్రస్తావించారు. 
 
కరోనా కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే 6,890 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇలాంటి సమయంలో మరోమారు కరోనా వైరస్ వ్యాప్తి చెందేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని ఆ లేఖలో ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు కనుక ఎన్నికలు నిర్వహిస్తే వైరస్ గ్రామాలకు కూడా పాకిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
కరోనా కట్టడికి పోలీసులు, వివిధ శాఖల ఉద్యోగులు, పరిపాలన సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారన్న సీఎస్.. పరిస్థితి అనుకూలించిన వెంటనే ఎన్నికల సంఘానికి సమాచారం అందిస్తామన్నారు. ప్రజల ఆరోగ్యం, భద్రత నేపథ్యంలో ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ ఎంతమాత్రమూ ఆమోద యోగ్యం కాదని ఆమె తన లేఖలో తేల్చి చెప్పారు. 
 
అందువల్ల ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయంపై మరోమారు ఆలోచించాలని కోరారు. అలాగే, నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు తెలిసిందని, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అది అవసరం లేదని తాము భావిస్తున్నట్టు నీలం సాహ్ని ఆ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ.. నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ కానున్నారు.
 
గతంలో గత ఏప్రిల్ - మే నెలలో కరోనా వైరస్ కారణంగా ఇదే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదావేయడం జరిగింది. ఇపుడు రాష్ట్ర ఎన్నికల సంఘంపై ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేనా నువ్వా (రమేష్ కుమార్) అంటూ మీడియా సమావేశం పెట్టిమరీ ఆక్రోశం వెళ్ళగక్కారు. ఆ తర్వాత ఆగమేఘాలపై రమేష్ కుమార్‌ను అర్థాంతరంగా ఇంటికి పంపించారు. 
 
అయితే, రమేష్ కుమార్ న్యాయపోరాటం చేసి తిరిగి ఆ బాధ్యతలను చేపట్టారు. ఇపుడు వచ్చే యేడాది ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఆయన సమాయత్తమవుతుంటే ప్రభుత్వమే ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుపడుతోంది. దీనికి కారణం.. రమేష్ కుమార్ సారథ్యంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఎంతమాత్రం సముఖంగా లేదనే విషయం తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత సైనికులపై సూక్ష్మ తరంగాలతో చైనా దాడి...?