ప్రపంచం మొత్తం విస్తరణవాదం వైపు మొగ్గు చూపుతోందని, కాని భారత్ మాత్రం అందుకు వ్యతిరేకమని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఆయన భారత సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు.ఆ తర్వాత రాజస్థాన్ రాష్ట్రంలోని లోంగీవాలాలో జవాన్లను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, చైనా పేరును ప్రస్తావించకుండా వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచమంతా ఇప్పుడు విస్తరణ వాదంలో ఉందని, 18వ శతాబ్దంలో ఉన్నటువంటి పరిస్థితులే ఇప్పుడూ కనిపిస్తున్నాయని, భారత్ మాత్రం విస్తరణ వాదానికి వ్యతిరేకమని అన్నారు. అంతేకాకుండా, ఇండియాకు ఇరుగు, పొరుగున ఉన్న దేశాల నుంచి ఏదైనా ముప్పు ఏర్పడితే దీటైన జవాబిచ్చేందుకు ఏ క్షణమైనా సిద్ధంగా ఉంటామని వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా, 'ఇండియా తన ప్రయోజనాలను కాపాడుకోవడంలో ఏ మాత్రమూ వెనక్కు తగ్గబోదని ఇప్పుడు ప్రపంచానికి తెలుసు. ఇండియాకు పొరుగునే ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశం ఉంది. భారత జవాన్లు వారి దేశంలోకి చొచ్చుకెళ్లి లక్షిత దాడులు చేశారు. మనపై దాడులు చేస్తే, మనమేం చేయగలమన్న విషయం సర్జికల్ దాడుల తరువాత ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు భారత సైన్యం పలు పెద్ద దేశాలతో కలిసి సైనిక విన్యాసాలు చేస్తోంది. ఉగ్రవాదంపై పోరులో పలు దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పరచుకున్నాం. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న స్థావరాలపైనా దాడులు చేయగలమని నిరూపించాం" అని మోడీ వ్యాఖ్యానించారు.
దేశ రక్షణ కోసం సైనికులు ప్రదర్శిస్తున్న ధైర్య సాహసాలకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవన్నారు. జవాన్ల కోసం స్వీట్లు, దేశ ప్రజల ప్రేమ తీసుకువచ్చానంటూ ప్రధాని పేర్కొన్నారు. మీరు మంచుకొండలపైన, ఎడారుల్లో దేశం కోసం శ్రమిస్తున్నారు. మీతో కలిసిన తర్వాతే నాకు దీపావళి పూర్తవుతుంది. మీరు ముఖాల్లో సంతోషం చూసినప్పుడు నా ఆనందం రెట్టింపవుతుంది.
130 కోట్ల మంది భారతీయులు మీతో ఉన్నారు. మీ పరాక్రమాన్ని చూసి వారు గర్వపడుతున్నారు. ప్రపంచంలోని ఏ శక్తికి కూడా సరిహద్దుల్లో మిమ్మల్ని ఎదిరించే సత్తాలేదు. నేడు భారత సైన్యం ఉగ్రవాదుల స్థావరాల్లోకి వెళ్లి వాళ్లను, వాళ్ల నాయకులను హతమార్చింది. దీంతో భారత్ తన జోలికి వెళ్తే ఎవరినైనా చిత్తు చేస్తుందనే విషయం ప్రపంచానికి తెలిసొచ్చింది అని ప్రధాని మోదీ సైనికులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
కాగా, నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రతి ఏడాది దీపావళి వేడుకలు దైశ సైనికులతో జరుపుకోవడం ఆనవాయితిగా వస్తోంది. గతేడాది జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో దీపావళి వేడుకల్లో పాల్గొనగా, 2018లో ఉత్తరాఖండ్ సరిహద్దు సైనికులతో కలిసి మోదీ దీపావళి పండుగ జరుపుకున్నారు. 2017లోనూ ఉత్తర కశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్‌లో సైనికులతో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.