Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించాకే సాగు చట్టాలకు ఆమోదం : రాష్ట్రపతి

Advertiesment
పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించాకే సాగు చట్టాలకు ఆమోదం : రాష్ట్రపతి
, శుక్రవారం, 29 జనవరి 2021 (12:38 IST)
కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త సాగు చట్టాలపై రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ అంశాన్ని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శుక్రవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించారు. రైతుల సంక్షేమం కోసమే కేంద్ర ప్ర‌భుత్వం కొత్త‌ సాగు చట్టాలను తీసుకొచ్చింద‌ని గుర్తుచేశారు. 
 
పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాల ప్రారంభం సంద‌ర్భంగా ఆయ‌న ఉభ‌య స‌భ‌లనుద్దేశించి మాట్లాడుతూ.. కొత్త‌ సాగు చట్టాలతో రైతులకు కొత్త అవకాశాలు, హక్కులు లభిస్తాయన్నారు. విస్తృత చర్చల అనంత‌రం కొత్త చట్టాలు పార్లమెంటులో ఆమోదం పొందాయ‌న్నారు. 
 
స్వామినాథన్‌ కమిషన్ చేసిన‌ సిఫార్సుల ప్రకార‌మే కేంద్ర ప్ర‌భుత్వం మద్దతు ధరలను పెంచుతోందన్నారు. అలాగే, సుప్రీంకోర్టు ఇచ్చిన‌ ఆదేశాల మేరకు సాగు చట్టాలపై కేంద్ర‌ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని తెలిపారు.
 
కాగా, గ‌త ఏడాది క‌రోనాయే కాకుండా తుపాన్ల నుంచి బ‌ర్డ్‌ఫ్లూ వ‌ర‌కు దేశం ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొందని రాష్ట్ర‌ప‌తి కోవింద్ తెలిపారు. ప్ర‌తి స‌మ‌స్య‌ను దేశ‌మంతా ఒక్క‌టిగా ఎదుర్కొందని చెప్పారు. క‌రోనా వైర‌స్ చాలా మంది ప్రాణాల‌ను బ‌లి తీసుకుందని, ఎంద‌రో మ‌హ‌నీయుల ప్రాణాలు తీసిందని గుర్తు చేశారు.
 
ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ వంటి నేత‌లు క‌రోనాతో మ‌ర‌ణించారని అన్నారు. కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌న నిర్మాణం కోసం గ‌త ప్ర‌భుత్వాలు ప్ర‌య‌త్నించాయని, స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏళ్లు పూర్త‌వుతున్న ప్రస్తుత స‌మ‌యంలో కొత్త పార్ల‌మెంట్ నిర్మాణం జ‌రుగుతుండ‌డం సంతోష‌క‌రమ‌ని తెలిపారు.
 
దేశంలో కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా రైతుల ఖాతాల్లోకి న‌గదును బదిలీ చేస్తున్న‌ట్లు కోవింద్ గుర్తు చేశారు. వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధికి రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ప్రారంభించిన‌ట్లు తెలిపారు. అలాగే, దేశంలో మత్స్యకారుల కోసం రానున్న ఐదేళ్లలో రూ.20 వేల కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
 
మరోవైపు, కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలపై రైతులు ఉద్యమం చేస్తోన్న‌ నేపథ్యంలో ఆయ‌న ప్ర‌సంగాన్ని దేశంలోని 18 పార్టీలు బ‌హిష్క‌రించాయి. మరోవైపు, ఆర్థిక సర్వేను విత్తమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారమే సభలో ప్రవేశపెట్టనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిమ్మగడ్డ ఓటును తొలగిస్తే... సీఎంకు ఎలా ఉంచారు? టీడీపీ నేతల ప్రశ్న