Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అగ్రి చట్టాలపై సుప్రీం నియమించిన కమిటీ నుంచి తప్పుకున్న భూపిందర్!

అగ్రి చట్టాలపై సుప్రీం నియమించిన కమిటీ నుంచి తప్పుకున్న భూపిందర్!
, గురువారం, 14 జనవరి 2021 (17:24 IST)
కేంద్రం తీసుకొచ్చిన కొత్త మూడు సాగు చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేసిన సుప్రీంకోర్టు.. నలుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యుడుగా ఉన్న భూపిందర్ సింగ్ మన్ ఇపుడు ఆ కమిటీ నుంచి తప్పుకున్నారు. తన నియామకంపై రైతు నేతలు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో చర్చల కమిటీ నుంచి వైదొలగుతున్నట్లు గురువారం తెలిపారు.
 
కాగా, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు నిరసనల పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు మంగళవారం నలుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించిన విషయం తెల్సిందే. అదేసమయంలో తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు ఈ సాగు చట్టాల అమలును నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. 
 
ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీలో వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటి, భారతీయ కిసాన్ యూనియన్-మన్ అధ్యక్షుడు భూపిందర్ సింగ్ మన్, శెట్కరి సంఘట‌న్ అధ్యక్షుడు అనిల్ ఘన్వత్, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన ప్రమోద్ కుమార్ జోషి సభ్యులుగా ఉంటారని తెలిపింది. 
 
అయితే కమిటీలోని సభ్యులంతా ప్రభుత్వానికి అనుకూలంగా, వ్యవసాయ చట్టాలకు మద్దతిచ్చేవారేనని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ కమిటీతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో తాను నిష్పాక్షికంగా ఉండాలని భావిస్తున్నానని, రైతుల నిరసనకు సంబంధించి ప్రజల మనోభావాల కారణంగా కమిటీ నుంచి తప్పకుంటున్నట్లు భూపిందర్ సింగ్ మన్‌ చెప్పారు. 
 
అదేసమయంలో కమిటీ సభ్యుడిగా తనను నియమించిన సుప్రీంకోర్టుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఒక రైతుగా, యూనియన్ నాయకుడిగా వ్యవసాయ సంఘాలు, ప్రజలలో సాధారణంగా ఉన్న మనోభావాలు, భయాలను దృష్టిలో ఉంచుకుని కమిటీకి దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. 
 
పంజాబ్, రైతుల ప్రయోజనాల కోసం రాజీపడకుండా ఉండటానికి తనకు ఇచ్చిన ఏ పదవినైనా త్యాగం చేయడానికి సిద్ధమేనని అన్నారు. అందుకే కమిటీ నుంచి స్వయంగా తప్పుకున్నానని, తాను ఎల్లప్పుడూ రైతులు, పంజాబ్‌ పక్షాన ఉంటానని భూపిందర్‌ సింగ్‌ వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిగ్గుండాలి.. అలా అనడానికి.. ఓడిపోయి రెండేళ్లు అయింది.. : విజయసాయి