రైతుల నిరసనల నడుమ కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల అమలుపై మంగళవారం సుప్రీం కోర్టు నిలుపుదల ఆదేశాలు ఇచ్చింది. చట్టాలకు సంబంధించి రైతుల సాధకబాధకాలు వినేందుకు నలుగురు సభ్యుల కమిటీని సుప్రీం కోర్టు ఏర్పాటుచేసింది.
ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సంస్థ దక్షిణాసియా విభాగం డైరెక్టర్ ప్రమోద్ కుమార్ జోషి, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజస్ మాజీ ఛైర్మన్ అశోక్ గులాటీ, ఆర్థిక నిపుణులు అనిల్ ధనావత్, హర్‌సిమ్రత్ మాన్‌లతో సుప్రీం కోర్టు ఈ కమిటీని ఏర్పాటుచేసింది.
కమిటీ ముందుకు వెళ్లడానికి మేం సిద్ధంగా లేమన్న రైతు సంఘాలు
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు సూచనలతో ఏర్పాటయ్యే కమిటీ ముందు తమ గోడు వెళ్లడించడానికి తాము సిద్ధంగా లేమని రైతు సంఘాలు తెలిపాయి. ఈ వ్యవసాయ చట్టాల విషయంలో రైతు సంఘాలన్నీ ఒకే మాటపై ఉన్నాయని, ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని సంయుక్త కిసాన్ మోర్చా ఓ ప్రకటన విడుదల చేసింది.
వ్యవసాయ చట్టాల అమలు నిలుపుదలపై సుప్రీం కోర్టు సూచనలను మేం స్వాగతిస్తున్నాం. అయితే, సుప్రీం కోర్టు సూచనలతో ఏర్పాటయ్యే కమిటీ ముందుకు వెళ్లకూడదని మేం నిర్ణయం తీసుకున్నాంఅని ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే వారు చట్టాలను వెనక్కి తీసుకునేలా కనిపించడం లేదు. అలాంటప్పుడు మేం ఆ కమిటీ ముందుకు వెళ్లి ఉపయోగం ఉండదుఅని ప్రకటనలో వివరించారు.