ఓ విద్యార్థిని హోంవర్క్ చేయలేదనీ సహచర విద్యార్థులతో ఓ ఉపాధ్యాయుడు 168 సార్లు చెంపదెబ్బలు కొట్టించాడు. ఇలా రెండు రోజుల పాటు చేయించాడు. దీంతో ఆ బాలిక రెండు చెంపలు వాచిపోయాయి. ఈ ఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ టీచర్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని తాండ్లా పట్టణంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శివ్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తికి కుమార్తె ఉంది. ఆ బాలిక తాండ్లా పట్టణంలోని నవోదయ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. అయితే, అనారోగ్య కారణాల దృష్ట్యా గతేడాది జనవరి 1 నుంచి 10 వరకు స్కూలుకు వెళ్లలేకపోయింది.
ఈ క్రమంలో 11వ తేదీన స్కూలుకు వెళ్లగా హోం వర్క్ చేయలేదంటూ మనోజ్ వర్మ అనే ఉపాధ్యాయుడు మందలించాడు. అనంతరం బాధితురాలిని 168 సార్లు చెంపదెబ్బలు కొట్టాల్సిందిగా తోటి విద్యార్థులను ఆదేశించాడు. ఆరు రోజుల్లో రోజుకు రెండుసార్లు ఇలా ఆమెను శిక్షించాలంటూ 14 మంది బాలికలకు చెప్పాడు.
ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి తండ్రి పాఠశాల ప్రధానోపాధ్యాయునికి ఫిర్యాదు చేశాడు. దీంతో కమిటీ వేసి మనోజ్ వర్మను దోషిగా తేల్చి.. ఇటీవల అతడిని సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించగా.. కోర్టు అతడి అభ్యర్థనను తిరస్కరించింది.