పగబట్టిన విధి : మృగాళ్ళ వేధింపులు భరించలేక...

గురువారం, 16 మే 2019 (09:52 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళను విధి పగబట్టింది. కేవలం 14 యేళ్ళకే వివాహమైంది. ఆ తర్వాత భర్తతో ఏర్పడిన మనస్పర్థలు కారణంగా విడాకులు తీసుకుని పుట్టింటికి వచ్చింది. ఇదే అదునుగా భావించిన ఆ అభాగ్యురాలిని ముగ్గురు మగాళ్లు చెరబట్టారు. కొన్నేళ్లుగా అత్యాచారం చేస్తూనేవచ్చారు. అయితే, ఆ మృగాళ్ళ వేధింపులు మరింతగా హెచ్చుమీరిపోవడంతో ఇక తాను భవించలేనని గ్రహించి శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణం ఘటన వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హపూర్‌కు చెందిన 29 ఏళ్ల మహిళకు తల్లిదండ్రులు చిన్నవయసులోనే పెళ్లి చేశారు. ఆ తర్వాత అభంశుభం తెలియని వయసులోనే ఓ బిడ్డకు తల్లి అయింది. చివరకు భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుని పుట్టింటికి వచ్చి, ఒంటరిగా జీవించసాగింది. 
 
ఇదే అదునుగా భావించిన అదే గ్రామానికి చెందిన ముగ్గురు మృగాళ్లు ఆ మహిళను లైంగికంగా వాడుకోవడం ప్రారంభించారు. ప్రస్తుతం ఆమె వయసు 29 యేళ్లు. ప్రస్తుతం తాను ఉన్న పరిస్థితుల్లో ఆ కామాంధుల అకృత్యాలను బయటకు చెప్పలేక పోయింది. పైగా, ఈ విషయం బయటకు తెలిస్తే నలుగురిలో చులకన అవుతానని భావించింది. 
 
దీంతో కామాంధుల దారుణాలను భరిస్తూ వచ్చింది. ఏళ్లు గడుస్తున్నా.. మృగాళ్లు తనను విడిచి పెట్టకపోవడంతో ఇక ఇలాంటి జీవితం వద్దనుకుంది. దాంతో తనకు తానే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలి మరణించిన తర్వాత కామాంధుల అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. అయినా పోలీసుల్లో చలనం లేదు. దీనిపై ఢిల్లీ మహిళా సంఘం యూపీ సీఎం ఆదిత్యనాథ్‌కు లేఖ రాయడంతో ఆయన ఆదేశం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఒక్క నిందితుడినీ అరెస్టు చేయకపోవడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నీతోనే ఉంటా.. భర్త అక్కర్లేదన్న కుమార్తెను హత్య చేసిన తల్లి