పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జంబో మంత్రివర్గం ఏర్పాటైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. సోమవారం 43 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులతో గవర్నర్ జగదీప్ ధన్కర్ ప్రమాణం చేయించారు.
24 మంది కేబినెట్ మంత్రులుగా, పది మంది రాష్ట్ర మంత్రులు (స్వతంత్ర), మరో తొమ్మిది మంది రాష్ట్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రిమండలిలో చాలా మంది పాతమంత్రులు తమ బెర్తులను మళ్లీ దక్కించుకోగా.. కొత్తగా బంకిమ్ చంద్ర హజ్రా, రతిన్ ఘోష్, పులక్ రాయ్, బిప్లబ్ మిత్రాను పదవులు వరించాయి.
కాగా, 2011 నుంచి రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పని చేస్తున్న అమిత్ మిత్రా సైతం కేబినెట్‌లో చేరారు. ఆయన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో.. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యేందుకు ఆరు నెలల సమయం ఉంది.
మాజీ ఐపీఎస్ అధికారి హుమాయున్ కబీర్, రత్న దే నాగ్ సైతం మంత్రి (స్వతంత్ర) పదవులు వరించాయి. అలాగే రాజకీయ నాయకుడిగా మారిన క్రికెటర్ మనోజ్ తివారీ సైతం మంత్రి మండలిలో చోటు దక్కించుకున్నాడు.
ఇదిలావుంటే, బెంగాల్‌లో గవర్నర్ జగదీప్ ధన్కర్‌కు, సీఎం మమత బెనర్జీకి మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతూనే ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో మమత ఘనవిజయం సాధించి పగ్గాలు చేపట్టిన అనతికాలంలోనే నారద టేపుల కేసులో ఇదివరకటి మమత ప్రభుత్వంలోని నలుగురిపై సీబీఐ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి జారీ చేయడంపై వివాదం రగులుకుంటున్నది.
అందులో ఇద్దరు (సుబ్రత ముఖర్జీ, ఫిర్హాద్ హకీం) సోమవారం నాటి విస్తరణలో మంత్రి పదవులు పొందడం గమనార్హం. గవర్నర్ అనుమతి ఇవ్వడం, అదీ ఈ సమయంలో ఇవ్వడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమంటే సువేందు అధికారి ప్రాసిక్యూషన్‌పై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడి చేయకపోవడం.
నారద టేపుల కుంభకోణం జరిగిన సమయంలో తృణమూల్ ఎంపీగా ఉన్న సువేందు ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గవర్నర్ ప్రాసిక్యూషన్ అనుమతి మంజూరు చేసిన మరో ఇద్దరు మాజీ మంత్రుల్లో మదన్ మిత్రాకు ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. మరో మంత్రి సోవన్ చటర్జీ తృణమూల్ నుంచి 2019 ఆగస్టులో బీజేపీలోకి మారిపోయారు.
తర్వాత అందులో నుంచి కూడా బయటకు వచ్చారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. గవర్నర్ అనుమతి కథలో ఇంకో ట్విస్టు కూడా ఉంది. లోక్‌సభ సభ్యుల ప్రాసిక్యూషన్‌కు స్పీకర్ అనుమతి తప్పనిసరి. అలాగే ఎమ్మెల్యేల ప్రాసిక్యూషన్‌కు అసెంబ్లీ స్పీకర్ అనుమతి కావాలి.
కానీ ఎందువల్లనో సీబీఐ ఆ మార్గంలో వెళ్లకుండా మంత్రుల ప్రాసిక్యూషన్ అంటూ గవర్నర్ దగ్గరకు వెళ్లింది. ఆరుగురు ఎంపీలు, నలుగురు మంత్రులు లంచం తీసుకోవడం నారద టేపుల్లో రికార్డు అయింది. అందులో ఒకరు చనిపోయారు. కొందరు పార్టీలు మారారు.