కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన ఆదాయం మొత్తం పూర్తిగా తగ్గిపోయిందని, అందువల్ల ఇపుడు తాను డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని కేంద్ర మంత్రి సురేష్ గోపి అన్నారు. అందుకే తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు.
కన్నూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, తాను మళ్లీ సినిమాల్లో నటించాలనుకుంటున్నట్టు చెప్పారు. తనకు డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం ఉందని, ఇపుడు తన ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందన్నారు. ఎన్నికలకు ముందు రోజు కూడా తాను మంత్రి పదవి కోరుకోవడం లేదని సినిమాల్లోనే కొనసాగాలని అనుకుంటున్నట్టు చెప్పారు.
తాను మంత్రి కావాలని ఎన్నడూ ప్రార్థించలేదన్నారు. పార్టీలోనే తానే చిన్నవాడినని, తన స్థానంలో రాజ్యసభ ఎంపీ సి.సదానందన్ మాస్టర్‌కు మంత్రి పదవి ఇవ్వాలని సూచించినట్టు చెప్పారు. కేరళలో ప్రజలు ఎన్నుకున్న తొలి ఎంపీని కావడంతో తనను పార్టీ మంత్రిని చేయాలని భావించిందన్నారు. అయితే, కొందరు తన మాటలను వక్రీకరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తన నియోజకవర్గమైన త్రిశూర్ ప్రజలను ఉద్దేశించి తాను ప్రజ అనే పదాన్ని వాడటాన్ని కొందరు విమర్శించారని ఆయన గుర్తుచేశారు. ఒకపుడు పారిశుద్ధ్య కార్మికులు వేరే పేరుతో పిలిచేవారని, ఇపుడు వారిని శానిటేషన్ ఇంజనీర్లు అని పిలుస్తున్నారని తెలిపారు. అలాగే తాను ప్రజ, ప్రజాతంత్ర వంటి పదాలు వాడితే తప్పేంటి అని సురేష్ గోపి ప్రశ్నించారు.