కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపీ మరోమారు వార్తల కెక్కారు. ఇంటి నిర్మాణం కోసం అభ్యర్థించిన ఓ వృద్ధుడి దరఖాస్తును తీసుకునేందుకు ఆయన నిరాకరించారు. ఈ ఘటన ఇటీవల జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, ఆయన ఏమాత్రం చలించకుండా తనపై వచ్చిన విమర్శలను కొట్టిపారేశారు. పైగా, అమలు చేయలేని హామీలను ఇవ్వబోనని తేల్చి చెప్పారు.
ఇదిలావుంటే, బుధవారం తన నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఆ సమయంలో ఆయన ఓ వృద్ధ మహిళతో దురుసుగా మాట్లాడి మరో వివాదంలో చిక్కుకున్నారు. సీపీఎం నేతల ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలున్న కరువన్నూర్ సహకార బ్యాంకు కుంభకోణంలో పలువురి డిపాజిట్లు చిక్కుకుపోయాయి. దీనిపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి సురేశ్ గోపిని కలిసిన ఆనందవల్లి అనే మహిళ తన డిపాజిట్ సొమ్ము తిరిగి ఇప్పించడంలో సహకరించాలని కోరారు.
దీనికి సురేశ్ గోపి స్పందిస్తూ.. వెళ్లి మీ మంత్రికో, ముఖ్యమంత్రితో చెప్పు. ఎక్కువగా మాట్లాడొద్దు అంటూ దురుసుగా ప్రవర్తించారు. మీరు కూడా మా మంత్రే అని మహిళ వ్యాఖ్యానించగా, నేను దేశానికి మంత్రిని అని ఆయన బదులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
గత లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో డిపాజిట్లు వెనక్కి ఇప్పిస్తానని సురేశ్ గోపి హామీ ఇచ్చారని, ఇపుడు ఆ విషయాన్ని ప్రస్తావిస్తే అంత కఠువుగా మాట్లాడకుండా తన అభ్యర్థనను పరిశీలిస్తానని చెప్పినా సరిపోయేదని ఆనందవల్ల మీడియా ముందు వాపోయింది.