ఇలాంటి చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అంటున్నారు. తాను నటించిన జానకి వ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే సినిమా వివాదంపై తాజాగా స్పందించారు. ఆ సినిమాలో తనకు తెలియకుండా మార్పులు కూడా చోటుచేసుకున్నాయని తెలిపారు. తన మరో కొత్త సినిమా 'పరదా' ప్రమోషన్‌లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
"జానకి పేరును ప్రధాన పాత్రతో పాటు టైటిల్‌కు పెట్టడం వల్ల వివాదం తలెత్తింది. దాన్ని నేను అంగీకరించను. ఎంతోమంది దేవుళ్లు/దేవతలు ఉన్నారు. మనలో చాలామంది పేర్లు దేవుడి పేరుతో ముడిపడినవే. మా నాన్న పేరు పరమేశ్వరన్. శివుడిని సంహారమూర్తి అంటారు కదా. మరి, మా నాన్న అలా చేస్తారా? జానకి దేవి గురించి తప్పుగా చిత్రీకరించినప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు. కానీ, దేవుడి పేరుని పాత్రకో, సినిమాకో పెట్టడాన్ని వ్యతిరేకించడం సరికాదు"
"న్యాయం కోసం పోరాడే యువతి జానకి కథ ఇది. నటించేందుకు నేను అంగీకరించిన సమయంలో అంత వరకే నాకు తెలుసు. ఆ తర్వాత మార్పులు చోటుచేసుకున్నాయి. 'సినిమాని నాకు చూపించకపోతే నేను ప్రమోట్ చేయను' అని చెప్పా. ఎందుకంటే అందులో ఏముందో నాకు తెలియాలి కదా. చాలా సినిమాల విషయంలో ఇలాగే జరుగుతుంటుంది. మేం అంగీకరించిన స్క్రిప్టు.. సినిమా పూర్తయ్యేలోగా మారిపోతుంటుంది. ఇవన్నీ తెలియదు కాబట్టి 'ఎందుకు ఇలాంటి చెత్త సినిమాలు చేస్తారు' అని కొందరు అడుగుతుంటారు. కథే కాదు పాత్రల విషయంలోనూ అంతే" అని పేర్కొన్నారు.